KTR: ఎదురుదెబ్బ తగిలినా విడిచిపెట్టొద్దు: ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు కేటీఆర్‌ సూచన

భారతదేశం నుంచి కూడా పెద్దపెద్ద పారిశ్రామిక వేత్తలు, వ్యవస్థాపకులు రావాలని మంత్రి కేటీఆర్‌ ఆకాంక్షించారు. సీఎంఎస్‌టీఈఐ పథకంలో భాగంగా 24 మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఆయన యూనిట్లను పంపిణీ చేశారు.

Published : 24 Apr 2023 15:31 IST

హైదరాబాద్‌: ఆర్థికంగా నిలదొక్కుకోవాలనుకునే గిరిజన ఉన్నత విద్యావంతులకు ముఖ్యమంత్రి గిరజన ఎంటర్‌ప్రెన్యూర్‌ షిప్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ (సీఎంఎస్‌టీఈఐ) ఎంతగానో సహాయపడుతుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ పథకంలో భాగంగా ఇవాళ 24 మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు సీఎంఎస్‌టీఈఐ యూనిట్లను ఆయన పంపిణీ చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. భారతదేశం నుంచి కూడా పెద్దపెద్ద పారిశ్రామిక వేత్తలు, వ్యవస్థాపకులు రావాలని ఆకాంక్షించారు. భారతదేశాన్ని మనమే ముక్కలుగా విభజించుకున్నామని.. కానీ, కొవిడ్‌ సమయంలో యావత్‌ ప్రపంచం ఒక్కటైందని కేటీఆర్‌ గుర్తు చేశారు. సమాజాన్ని ఎన్ని ముక్కలుగా విభజించినా.. అందరం ఒక్కటే అనే మాట అప్పుడే అర్థమైందని చెప్పారు.

‘‘కులం, మతం కేవలం మనం తయారు చేసుకున్నవే. సీఎంఎస్‌టీఈఐపై ఉన్న పన్నును కూడా తొలగిస్తాం. కులమతాల భేదాన్ని వదిలేయాలి. చిత్తశుద్ధి ఉంటే ఎవరైనా ఏదైనా సాధించగలుగుతారు. ఇన్నోవేషన్‌, ఇన్ఫ్రాస్ట్రక్చర్‌, ఇంక్లూజివ్‌ గ్రోత్‌ (ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాలు, సమ్మిళిత వృద్ధి) ఈ మూడూ భారతదేశాన్ని అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ అందించే అన్ని సదుపాయాలను వినియోగించుకోండి. ఎదురుదెబ్బ తగిలినా విడిచిపెట్టొద్దు. ధైర్యంగా పనిని కొనసాగిస్తూ ముందుకు సాగండి’’ అని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

కేసీఆర్‌ పాలన స్వర్ణ యుగం: సత్యవతి రాథోడ్‌

సీఎంఎస్‌టీఈఐ పథకం ద్వారా ఇప్పటి వరకు 50 లక్షల మందికిపైగా గిరిజన ప్రజలకు ఆర్థిక సాయం అందించినట్లు మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలన తెలంగాణ ప్రజలకు స్వర్ణయుగమని అన్నారు. గిరిజన ప్రజల కోసం కొన్ని హక్కులన్నాయని గుర్తు చేసిందే కేసీఆర్‌ అని ఆమె తెలిపారు. గిరిజనులకు పరిపాలన భవనాలు కూడా ఏర్పాటు చేసిట్లు గుర్తు చేశారు.

ఈ పథకం ద్వారా రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వడంతోపాటు ప్రాజెక్టు స్వరూపాన్నిబట్టి రూ.కోటి వరకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుంది. ప్రభుత్వమే పూచీకత్తుగా బ్యాంకు లింకేజీని ఏర్పాటు చేయడంతోపాటు మొత్తం యూనిట్‌ కాస్ట్‌లో 35 శాతం రాయితీ కూడా ఇస్తుంది. ఈ పథకం కింద లబ్ధిపొందేందుకు కనీసం డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. లబ్ధిదారు ఎంపిక చేసుకొన్న పారిశ్రామికరంగంలో కనీసం రెండేళ్లు పనిచేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. సాంకేతిక విద్యార్హతలు, కొత్త స్టార్టప్స్‌, ఆర్థికంగా వెనుకబడినవారికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని