Bhadrachalam: భద్రాచలంలో కనులపండువగా శ్రీరామ మహా పట్టాభిషేకం

శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవ వేడుకతో గురువారం భద్రగిరి దివ్యక్షేత్రం పులకించింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు భక్తకోటికి నేనున్నానంటూ కొండంత అభయమిచ్చాడు.

Updated : 18 Apr 2024 15:27 IST

భద్రాచలం: శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవ వేడుకతో గురువారం భద్రగిరి దివ్యక్షేత్రం పులకించింది. వేద మంత్రోచ్ఛరణల మధ్య సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు భక్తకోటికి నేనున్నానంటూ కొండంత అభయమిచ్చాడు. ఉదయం నుంచి మాడవీధులన్నీ సందడిగా మారాయి. కల్యాణమూర్తులు శోభాయాత్రగా మిథిలా ప్రాంగణానికి చేరుకోగానే.. ఆ ప్రాంతమంతా శ్రీరామనామ స్మరణతో మార్మోగింది. అనంతరం వైదిక పెద్దలు శ్రీరామరాజ్యంలో ప్రజాశ్రేయస్సు ఎలా వర్ధిల్లిందో వివరించారు. గోదావరి నుంచి తీసుకొచ్చిన పుణ్య జలాలను భక్తులపై చల్లి ఆశీస్సులు అందించారు. సీతమ్మతో కలిసి స్వామివారు రాజాధిరాజుగా దర్శనమిచ్చారు. ఖడ్గం చేతబట్టి కిరీటాన్ని ధరించిన రాములవారిని చూసి భక్తజనం మురిసిపోయింది. 

రాములోరి సేవలో తరలించడం నా అదృష్టం: గవర్నర్‌

సీతారామచంద్రస్వామి వారి మహా పట్టాభిషేక మహోత్సవానికి రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ హాజరయ్యారు. ప్రధాన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు, ఆలయ ఈవో రమాదేవి ఆయనకు స్వాగతం పలికారు. అర్చకులు ఆయనకు వేదాశీర్వచనాలిచ్చి తీర్థప్రసాదాలు, జ్ఞాపికను అందించారు. ఆ తర్వాత గవర్నర్‌ మిథిలా మండపానికి చేరుకుని మహాపట్టాభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. దక్షిణ అయోధ్య భద్రాచలం సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా గవర్నర్‌ తెలిపారు. శ్రీ సీతారాముల సేవలో తరించడం తన అదృష్టమన్నారు. ప్రజలకు సుభిక్షమైన పాలన అందించడం, సుఖసంతోషాలతో ఉండేలా చూడటమే రామరాజ్య స్థాపన ఉద్దేశమని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని