Rains: తుపాను ప్రభావం.. ఏపీలో కొనసాగుతున్న వర్షాలు

మిగ్‌జాం తుపాను (Cyclone Michaung) వాయుగుండంగా బలహీనపడింది. ఇది మధ్యాహ్నానికి అల్పపీడనంగా బలహీనపడే అవకాశముంది. దీని ప్రభావంతో ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి.

Updated : 06 Dec 2023 11:23 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మిగ్‌జాం తుపాను (Cyclone Michaung) వాయుగుండంగా బలహీనపడింది. ఇది మధ్యాహ్నానికి అల్పపీడనంగా బలహీనపడే అవకాశముంది. దీని ప్రభావంతో ఏపీలో వర్షాలు కొనసాగుతున్నాయి. మరో 24 గంటలపాటు కోస్తాంధ్ర, రాయలసీమతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురవనున్నాయి.

👉 Follow EENADU WhatsApp Channel

  • తుపాను ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ మండలం దాములూరు కూడలి వద్ద వైరా, కట్టలేరు వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. తెలంగాణ నుంచి భారీగా నీరు చేరడంతో పల్లంపల్లి-దాములూరు గ్రామాల మధ్య కాజ్‌వే మీదుగా వరద ప్రవహిస్తోంది. వీరులపాడు-నందిగామ మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పంట పొలాల్లోంచి వరదనీరు వెళ్తోంది. దీంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.
  • ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. కట్లేరు, పడమటి, ఎదుళ్ల, విప్ల, గుర్రపు, కొండవాగులు ఉద్ధృతంగా ఉన్నాయి. తెలంగాణ నుంచి వస్తున్న వరదతో కట్లేరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. గంపలగూడెం మండలం వినగడప వద్ద తాత్కాలిక వంతెన పైనుంచి వరదనీరు వెళ్తోంది. దీంతో గంపలగూడెం- విజయవాడ మార్గంలో రెండు జిల్లాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 
  • కాకినాడ జిల్లా తుని, కోటనందూరు మండలాల్లో భారీ వర్షం కురిసింది. కోటనందూరు మండలం కాకరాపల్లి వద్ద బొండుగడ్డ వాగు పొంగి ప్రవహిస్తోంది. తుని-నర్సీపట్నం ప్రధాన రహదారిపైకి వరద చేరింది. దీంతో ఆ మార్గంలో వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఆర్టీసీ బస్సులు సైతం నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
  • తూర్పుగోదావరి జిల్లా ములగపూడి-బలరాంపురం మధ్య రోడ్డుపైకి భారీగా వరదనీరు చేరింది. రౌతులపూడి మండలంలోని పలు గ్రామాల్లో వరి పంట నీటమునిగింది. 
  • అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం పరదానిపుట్టు వంతెనపై వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో సుమారు 50 గ్రామాల ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దేవీపట్నం మండలం ఇందుకూరుపేట వద్ద కొండవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గోకవరం వైపు రాకపోకలు నిలిచిపోయాయి. 
  • అనకాపల్లి జిల్లా వడ్డాది వద్ద పెద్దేరుపై ఉన్న కాజ్‌వే పైనుంచి వరద ప్రవహిస్తోంది. నక్కపల్లి మండలంలో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. అక్కడ చేనేత కాలనీ నీటమునిగింది. ఎలమంచిలిలో వర్షానికి జగనన్న కాలనీలు ముంపునకు గురయ్యాయి. ఏటికొప్పాక వద్ద వరాహ నది, సోమలింగపాలెం సమీపంలో శారదా నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పాయకరావుపేటలో అంబేడ్కర్‌ కాలనీ నీటమునిగింది.  
  • ఏలూరు జిల్లా దెందులూరు మండలం పోతునూరులో కురిసిన భారీ వర్షానికి పంటలు నీటమునిగాయి. పొలాల్లో ధాన్యం రాశులు తడిసిపోయాయి. తడవకుండా ఉన్న ధాన్యాన్ని రైతులు ఇళ్లకు తరలించారు. కొవ్వలిలో ధాన్యం రాశుల చుట్టూ వరదనీరు చేరడంతో రైతులు లబోదిబోమంటున్నారు. సత్యనారాయణపురంలో వరికుప్పలు నీటమునిగాయి.
  • బాపట్ల జిల్లా చినగంజాం, మార్టూరు, యద్దనపూడి మండలాల్లో మంగళవారం మధ్యాహ్నం నుంచి విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. పర్చూరు మండలంలో రెండు రోజులుగా సరఫరా లేదు. తుపాను దెబ్బకు నెల్లూరు డివిజన్‌ పరిధిలో 250కి.మీ, కావలి డివిజన్‌లో 170 కి.మీ మేర ఆర్‌అండ్‌బీ రహదార్లు దెబ్బతిన్నాయి. నెల్లూరు డివిజన్‌లో విద్యుత్‌ శాఖకు రూ.10కోట్ల మేర నష్టం వాటిల్లింది. 4,500 విద్యుత్‌ స్తంభాలు విరిగిపడగా.. 1,081 ట్రాన్స్‌ఫార్మర్లకు మరమ్మతులు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని