SC Railway: విమానాశ్రయాలకు దీటుగా .. చర్లపల్లి రైల్వే టెర్మినల్‌: దక్షిణ మధ్య రైల్వే

జంటనగరాల్లో చర్లపల్లి రైల్వే స్టేషన్‌ నాలుగో అతిపెద్ద ప్యాసింజర్‌ టెర్మినల్‌గా అవతరించనుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్ కుమార్‌ జైన్‌ తెలిపారు. 

Updated : 02 Sep 2023 20:23 IST

చర్లపల్లి: జంటనగరాల్లో చర్లపల్లి రైల్వే స్టేషన్‌ నాలుగో అతిపెద్ద ప్యాసింజర్‌ టెర్మినల్‌గా అవతరించనుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్ కుమార్‌ జైన్‌ తెలిపారు. విమానాశ్రయాలతో సమానంగా ఆధునిక సౌకర్యాలతో కొత్త టెర్మినల్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. జంట నగరాలకు ప్రత్యామ్నాయం టెర్మినల్‌గా అభివృద్ధి చేస్తున్న చర్లపల్లి స్టేషన్‌లో జరుగుతున్న పనులను అరుణ్ కుమార్‌ జైన్‌ తనిఖీ చేశారు.

చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో మౌలిక సదుపాయాల పనులు, ఇతర ప్రయాణికుల సౌకర్యాలకు సంబంధించిన పనుల పురోగతిని జీఎంకు అధికారులు వివరించారు. అధికారుల బృందాన్ని అభినందించిన జీఎం.. పనులను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న స్టేషన్‌ నూతన భవనాన్ని ఆయన పరిశీలించారు. కోచ్‌ నిర్వహణ సౌకర్యాలు, ఇతర మౌలిక సదుపాయాల పనుల పురోగతిని ఆయన సమీక్షించారు.

రూ.221 కోట్లతో అభివృద్ధి పనులు...

చర్లపల్లి రైల్వే స్టేషన్‌ను ప్రత్యామ్నాయ కోచింగ్ టెర్మినల్‌గా అభివృద్ధి చేయడానికి రైల్వే బోర్డు  రూ.221 కోట్లు మంజూరు చేసిందని పేర్కొన్నారు. మొదటి దశ, రెండో దశ కింద చేపట్టిన పనులు కొనసాగుతున్నాయన్నారు. దీనికోసం ఇప్పటికే టెండర్లు పిలిచామని, 2023 చివరి నాటికి పనులు చేయాలని దక్షిణ మధ్య రైల్వే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఎంఎంటీఎస్‌ స్టేషన్ రెండో దశ ప్రాజెక్టులో భాగంగా అనేక సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. ప్రస్తుత ఏడాది బడ్జెట్‌లో చర్లపల్లి శాటిలైట్‌ టెర్మినల్‌ అభివృద్ధికి రూ.82 కోట్లు కేటాయించారన్నారు. చర్లపల్లి వద్ద పిట్‌లైన్ల కోసం ఆల్‌ వెదర్‌ కవర్‌ షెడ్ నిర్మించాలని  ప్రతిపాదించామని, మంజూరు కోసం రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపించామని దక్షిణ మధ్య రైల్వే జీఎం ఆరుణ్ కుమార్‌ జైన్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని