Nizamabad: ఆస్పత్రి ఘటన.. సిబ్బంది ఉండగా లాక్కెళ్లాల్సిన అవసరం ఏముంది?: సూపరింటెండెంట్‌

నిజామాబాద్‌ ఆస్పత్రిలో రోగిని తల్లిదండ్రులు ఈడ్చుకుంటూ వెళ్లిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. ఈ ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ స్పందించారు.

Updated : 15 Apr 2023 16:22 IST

నిజామాబాద్‌: నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో రోగిని ఈడ్చుకుంటూ వెళ్లిన ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రతిమారాజ్ స్పందించారు. ఆస్పత్రిలో వీల్‌ఛైర్, స్ట్రెచర్స్‌ కొరత లేదని స్పష్టం చేశారు. సిబ్బంది ఉండగా రోగిని లాక్కెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఈ మేరకు ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.

గత నెల 31న రాత్రి పేషంట్‌ను ఆస్పత్రికి తీసుకొచ్చారని సూపరింటెండెంట్‌ వివరించారు. ఆ సమయంలో అతడు మద్యం సేవించి ఉన్నాడని.. ఆరోజే చికిత్స అందించి వెయిటింగ్‌ రూమ్‌లో ఉంచారని తెలిపారు. ఆస్పత్రి సిబ్బంది ఉండగా అలా ఈడ్చుకెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. పేషెంట్‌ను లాక్కెళ్లేటప్పుడు సిబ్బంది గమనించి వారించారని చెప్పారు. ‘‘10 సెకన్లలోనే వీడియో పూర్తయిపోయిందంటే సిబ్బంది స్పందించినట్లే కదా. అక్కడ సిబ్బంది ఉండి మాట్లాడి ఎందుకు వీడియో తీస్తున్నారని అడిగితేనే అక్కడితో వీడియో ఆగిపోయింది. వీడియో తీసిన వ్యక్తిని సిబ్బంది ప్రశ్నిస్తే పారిపోయాడు. ఉద్దేశపూర్వకంగానే వీడియో తీసినట్లు అనిపిస్తోంది. అందుకే పదిహేను రోజుల తర్వాత సామాజిక మాధ్యమాల్లో వీడియోను పోస్ట్‌ చేశారు’’ అని ఆమె తెలిపారు.

ఇదీ చదవండి: రోగిని ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన తల్లిదండ్రులు.. ఆలస్యంగా వెలుగులోకి..

‘‘ఆస్పత్రి సిబ్బంది అలెర్ట్‌గానే ఉన్నారు. సిబ్బంది చేసిన నిర్లక్ష్యం ఏంటంటే జరిగిన విషయాన్ని తర్వాత రోజు ఉదయం మా దృష్టికి తీసుకురాకపోవడం. ఒకవేళ మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే మేం చర్యలు తీసుకునేవాళ్లం. ఈ విషయంపై సిబ్బందిని ప్రశ్నిస్తే ‘మేం వెంటనే వీడియోను ఆపించాం. పేషెంట్ కూడా బాగానే ఉన్నాడు. విషయం తెలిసిన వెంటనే 10సెకన్లలోనే స్పందించాం. ఇది ఇంతలా వైరల్‌ అవుతుందని మేం ఊహించలేదు’ అని చెప్పారు. దీనిపై మేం సమగ్ర విచారణ జరుపుతాం. పోలీసులకు కూడా ఫిర్యాదు చేస్తాం. జరిగిన ఘటనను మేం సమర్థించడం లేదు. ఈ ఘటనలో ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే తగిన చర్యలు తీసుకుంటాం’’ అని సూపరింటెండెంట్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని