Nizamabad: రోగిని ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన తల్లిదండ్రులు.. ఆలస్యంగా వెలుగులోకి..

చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వచ్చిన కుటుంబం.. రోగిని ఈడ్చుకుంటూ తీసుకువెళ్లిన ఘటన నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

Updated : 15 Apr 2023 11:34 IST

నిజామాబాద్‌ (వైద్యం): చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వచ్చిన కుటుంబం.. రోగిని ఈడ్చుకుంటూ వెళ్లిన ఘటన నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. గత నెల 31వ తేదీన జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే.. అనారోగ్యానికి గురవడంతో ఓ వ్యక్తిని అతడి తల్లిదండ్రులు గత నెల మార్చి 31వ తేదీన రాత్రి నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అదే సమయంలో విధుల్లో ఉన్న అత్యవసర విభాగం వైద్యులు అతడికి ప్రాథమిక చికిత్స అందించారు. ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయని గుర్తించి మరుసటి రోజు ఉదయం జనరల్ మెడిసిన్ విభాగానికి చెందిన ప్రత్యేక వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఆ తర్వాత పేషెంట్ కేర్ సిబ్బంది రోగిని వీల్‌ఛైర్‌లో తీసుకువచ్చి వెయిటింగ్‌ హాలులో బెంచ్ పైన కూర్చోబెట్టి వెళ్లారు.

మరుసటి రోజు ఉదయం సుమారు 8.30 గంటలకు ఓపీ చిట్టి తీసుకుని రెండో అంతస్తులో ఉన్న వైద్యుడి వద్దకు వెళ్లేందుకు.. ఆ తల్లిదండ్రులు అతడిని నేలపై ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో ఇది కాస్తా చర్చనీయాంశంగా మారింది. అయితే, సిబ్బంది లేకపోవడం వల్ల ఇలా చేశారా? లేక సిబ్బంది నిర్లక్ష్యమే ఇందుకు కారణమా? అనే విషయం విచారణలో తెలియాల్సి ఉంది. మరోవైపు దీనిపై ఆసుపత్రి సిబ్బంది స్పందిస్తూ.. పేషెంట్ కేర్ సిబ్బంది చక్రాల కుర్చీని తీసుకొచ్చేలోపే.. లిఫ్ట్ రావడంతో వారి తల్లిదండ్రులు నేలపై ఈడ్చుకుంటూ తీసుకువెళ్లారని చెప్పారు. రెండో అంతస్తుకు వెళ్లాక అతడిని వీల్‌ఛైర్‌లోనే తీసుకెళ్లినట్లు తెలిపారు. వైద్యుడిని సంప్రదించిన తర్వాత కూడా వీల్‌ఛైర్‌లోనే తీసుకువచ్చి దిగబెట్టినట్లు సిబ్బంది చెబుతున్నారు.

ఆస్పత్రిపై దుష్ప్రచారాలు చేసే వారిపై చర్యలు: సూపరింటెండెంట్‌ 

‘‘ఈ ఘటనపై ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బందిని విచారించాం. చక్రాల కుర్చీ తీసుకొచ్చేలోపే లిఫ్ట్ వచ్చిందని వారి తల్లిదండ్రులు లాగుతూ తీసుకెళ్లారు. చికిత్స అనంతరం రోగిని చక్రాల కుర్చీలోనే తీసుకొచ్చి కింద దిగబెట్టారు. ఇదంతా తెలియక ఎవరో ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేశాడు. పూర్తి సమాచారం తెలియకుండా ఇలాంటి వీడియోలు తీసి ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం పోగొట్టేలా చేయడం బాధాకరం. తెలంగాణ రాష్ట్రంలోనే నిజామాబాద్‌ ఆసుపత్రి ఒక ప్రత్యేక గుర్తింపు సాధించుకుంది. ఆస్పత్రిపై దుష్ప్రచారాలు చేసే వారిపై చర్యలు తీసుకుంటాం’’ అని సూపరింటెండెంట్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని