JPS Protest: విధుల్లో చేరకపోతే ఉద్యోగాల్లోంచి తొలగిస్తాం.. జేపీఎస్‌లకు తెలంగాణ ప్రభుత్వం నోటీసులు

జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్‌) సమ్మె వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. రేపు సాయంత్రం 5 గంటల వరకు జేపీఎస్‌లు విధుల్లో చేరాలని అదేశాలు జారీ చేసింది. ఒకవేళ విధుల్లో చేరకపోతే ఉద్యోగాల్లోంచి తొలగిస్తామని స్పష్టం చేసింది.

Updated : 08 May 2023 19:30 IST

హైదరాబాద్‌: జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల (జేపీఎస్‌) సమ్మె వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. రేపు సాయంత్రం 5 గంటల వరకు జేపీఎస్‌లు విధుల్లో చేరాలని అదేశాలు జారీ చేసింది. ఒకవేళ విధుల్లో చేరకపోతే ఉద్యోగాల్లోంచి తొలగిస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌ సుల్తానియా నోటీసులు జారీ చేశారు. రాష్ట్రంలోని జూనియర్‌ పంచాయతీ కార్యదర్శులు, ఒప్పంద ప్రాతిపదికన పనిచేసే కార్యదర్శులు తమను క్రమబద్ధీకరించాలని డిమాండ్‌ చేస్తూ ఏప్రిల్‌ 29 నుంచి నిరవధిక సమ్మెకు దిగిన విషయం తెలిసిందే.

తాజాగా ఈ వ్యవహారంపై రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. సమీక్ష అనంతరం సీఎం కేసీఆర్‌ను కలిసిన ఎర్రబెల్లి.. జేపీఎస్‌ల సమ్మె గురించి వివరించారు. సమ్మె విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా ప్రభుత్వం నిర్ణయించింది. జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల సంఘం ప్రతినిధులు రాష్ట్ర నీటి వనరుల సంస్థ ఛైర్మన్‌ వి.ప్రకాశ్‌ ఆధ్వర్యంలో ఆదివారం మంత్రి ఎర్రబెల్లిని ఆయన నివాసంలో కలిశారు. సమ్మె సబబు కాదని, వెంటనే విధుల్లో చేరితే వారి క్రమబద్ధీకరణ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామని మంత్రి చెప్పారు. అయితే, తాము న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడంతోనే సమ్మెకు వెళ్లామని సంఘం ప్రతినిధులు వెల్లడించారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు సమ్మె కొనసాగిస్తామని మంత్రికి వారు తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో జేపీఎస్‌ల సమ్మెపై తాజాగా స్పందించిన ప్రభుత్వం.. సమ్మె విరమించి విధుల్లో చేరాలని నోటీసులు జారీ చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు