TS High court: ఎమ్మెల్సీల నియామకంలో ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు

ఎమ్మెల్సీల నియామకాలపై తెలంగాణ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్‌ కోదండరాం, ఆమిర్‌ అలీఖాన్‌లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు...

Updated : 07 Mar 2024 14:06 IST

హైదరాబాద్‌: ఎమ్మెల్సీల నియామకాలపై తెలంగాణ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్‌ కోదండరాం, ఆమిర్‌ అలీఖాన్‌లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ను ఉన్నత న్యాయస్థానం తాజాగా కొట్టివేసింది.

భారాస ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆ పార్టీ నేతలు దాసోజు శ్రవణ్‌, కుర్రా సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా నామినేట్‌ చేస్తూ మంత్రిమండలి తీర్మానం చేసింది. దాన్ని గవర్నర్ తమిళిసై గతేడాది సెప్టెంబర్ 19న తిరస్కరించారు. గవర్నర్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ వారిద్దరూ హైకోర్టును ఆశ్రయించారు. గవర్నర్‌ పరిధి దాటి వ్యవహరించారని, మంత్రిమండలికి ఎమ్మెల్సీలను నామినేట్ చేసే హక్కు ఉంటుందని పిటిషనర్లు పేర్కొన్నారు. భారాస నేతలు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.

అనంతరం రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటయ్యాక నామినేటెడ్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, ఆమిర్‌ అలీఖాన్‌లను రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసి గవర్నర్‌ వద్దకు పంపింది. రాష్ట్ర మంత్రిమండలి సిఫార్సును అనుసరించి వారి పేర్లను తమిళిసై ఆమోదించారు. అనంతరం కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం కూడా లభించడంతో వారి నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే దీన్ని సవాల్‌ చేస్తూ దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. గతంలో తాము వేసిన పిటిషన్‌పై నిర్ణయం వెలువడే వరకూ ఈ నియామకాలు ఆపాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.

దీనిపై పిటిషనర్లు, రాష్ట్ర ప్రభుత్వం, గవర్నర్‌ కార్యాలయం తరఫున న్యాయవాదులు సుదీర్ఘ వాదనల వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ను కొట్టివేస్తూ గురువారం తీర్పు వెలువరించింది. ఎమ్మెల్సీల నియామకంపై ప్రభుత్వం పునఃసమీక్షించుకోవాలని సూచించింది. గవర్నర్‌ తీసుకున్న నిర్ణయంపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్‌ నేరుగా తిరస్కరించకుండా.. తిరిగి పంపించాల్సిందని కోర్టు అభిప్రాయపడింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని