
Sirivennela: ఏపీ సీఎం జగన్కు కృతజ్ఞతలు తెలిపిన సిరివెన్నెల కుటుంబం
హైదరాబాద్: తమ కుటుంబానికి అండగా నిలిచిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు సిరివెన్నెల కుమారుడు సాయి యోగేశ్వర్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘మంగళవారం ఉదయం 10 గంటలకు కిమ్స్ ఆసుపత్రిలో ఉన్న మాకు సీఎం కార్యాలయం నుంచి ఫోన్ చేసి నాన్న ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆసుపత్రి ఖర్చులన్నీ చెల్లించాలని సీఎం ఆదేశించినట్టు అధికారులు చెప్పారు. సిరివెన్నెల నిన్న సాయంత్రం 4.07 గంటలకు మృతి చెందారు. సీఎం సంతాపం తెలిపారు. నాన్న అంత్యక్రియలకు ఏపీ మంత్రి పేర్ని నాని హాజరై.. ఆసుపత్రి ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని, మేము కట్టిన అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేలా ఆదేశాలు జారీ అయ్యాయని తెలిపారు. సిరివెన్నెల పట్ల ఇంత ప్రేమానురాగాలు చూపించి, మా కుటుంబానికి అండగా నిలిచిన ఏపీ సీఎం జగన్కు మా కుటుంబమంతా కృతజ్ఞతలు తెలియజేస్తోంది’’ అని సాయి యోగేశ్వర్ తెలిపారు. ఈమేరకు సీఎం సహాయ నిధి నుంచి సిరివెన్నెల వైద్య ఖర్చులు చెల్లించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. సిరివెన్నెల కుటుంబానికి స్థలం కేటాయించాలని సీఎం ఆదేశించినట్టు అధికారులు వెల్లడించారు.