Top 10 News @ 9AM: ఈనాడు.నెట్‌ టాప్‌ 10 న్యూస్‌ @ 9AM

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Published : 11 May 2023 08:59 IST

1. పది ఫేయిలైనా కలెక్టర్‌.. ఎంబీబీఎస్‌ తప్పినా డాక్టర్‌

మన చుట్టూ ఉన్న ఎంతోమంది విజయవంతమైన వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, వైద్యులు, ఉన్నతాధికారులందరి జీవితాలు వడ్డించిన విస్తరేమి కాదు. ఎన్నో ఓటములను దాటుకునే ఈ దశకు చేరుకున్నారు. పది, ఇంటర్‌ ఫెయిల్‌ అయినా కుంగిపోకుండా పట్టుదలతో చదివి ఐఏఎస్‌ స్థాయికి ఎదిగిన వారూ ఉన్నారు. వీరు కూడా ఇప్పుడు బలవన్మరణాలకు పాల్పడుతున్న పిల్లల మాదిరి తొందరపడితే గొప్ప విజయాలకు దూరమయ్యే వారని సైకాలజిస్టులు అంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. TS: ఇంటర్‌లోనూ గ్రేడ్లు ఇద్దామా?యోచనలో సర్కార్‌!

పదో తరగతి తరహాలోనే ఇంటర్‌లోనూ మార్కులకు బదులు గ్రేడ్లు ఇస్తే ఎలా ఉంటుందని సర్కార్‌ యోచిస్తోంది. మార్కుల పోటీతో విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి ఉండడం, పలువురు ఆత్మహత్యకు పాల్పడుతున్న నేపథ్యంలో గ్రేడ్‌ పాయింట్‌ యావరేజ్‌(జీపీఏ) ఇస్తే కొంతవరకైనా మానసిక ఒత్తిడి తగ్గుతుందని భావిస్తోంది. ఈ క్రమంలో ఇంటర్‌లో మార్కుల బదులు గ్రేడ్లు ఇస్తే మన విద్యార్థులకు ఇతర రాష్ట్రాల్లో ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఏమైనా సమస్య వస్తుందా? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కాస్త ఆగండి.. జీన్స్‌ బస్సు వచ్చింది

జన్యుపర లోపాలతో అరుదైన జబ్బుల బారిన పడి శారీరకంగా, మానసికంగా కుంగిపోతున్న వారు భారత్‌లో 9 కోట్ల మంది దాకా ఉంటారని అంచనా. తమ అనారోగ్యానికి జన్యుపర లోపాలు కారణమని తెలియనివారే వీరిలో అధికం. ప్రజల్లో అవగాహన కల్పించడంతో కొన్నింటినైనా నివారించవచ్చని.. ఆరంభంలో గుర్తిస్తే చికిత్సతో నయం చేసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా యువకుల్లో, విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకు మొబైల్‌ ఎగ్జిబిషన్‌ బస్సును రాష్ట్రవ్యాప్తంగా తిప్పబోతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఏపీలో సింగిల్‌ సబ్జెక్టు డిగ్రీ ప్రోగ్రామ్‌

వచ్చే విద్యా సంవత్సరం (2023-24) నుంచి డిగ్రీలో సింగిల్‌ సబ్జెక్టు మేజర్‌ ప్రోగ్రామ్‌లను ప్రవేశ పెడుతున్నట్లు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌, వైస్‌ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి, రామమోహన్‌రావు తెలిపారు. ప్రస్తుతం ఉన్న డిగ్రీ ప్రోగ్రామ్‌లను పూర్తిగా మార్పు చేస్తున్నామని, విశ్వవిద్యాలయాల నిధుల సంఘం(యూజీసీ) సూచనల మేరకు ఈ మార్పు చేసినట్లు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Vijayawada: ఇదే నాకు చివరి రోజు కావచ్చు.. పోస్ట్‌ పెట్టిన గంటల వ్యవధిలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి

‘నాకు ఇదే చివరి రోజు కావచ్చు’ అని తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఇంజినీరింగ్‌ విద్యార్థి పోస్ట్‌ పెట్టాడు. దానిని చూసిన స్నేహితుడు వెటకారం చేశాడు. ‘రాత్రికి నీకే తెలుస్తుందిలే..’ అని తిరిగి ఇన్‌స్టాలో సమాధానం పెట్టాడు. ఇది జరిగిన 8 గంటల్లో పోస్టు నిజమైంది. అది పెట్టిన యువకుడు అనుమానాస్పద స్థితిలో కాలిపోయి విగతజీవిగా కనిపించాడు. విజయవాడ నగర శివార్లలో ఇంజినీరింగ్‌ విద్యార్థి నిప్పంటించుకుని మృతి చెందిన ఘటన కలకలం రేపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. 1902 పలకలేదు

సంక్షేమ పథకాలు.. ప్రభుత్వ సేవలు అందకపోతే నేరుగా ‘‘ జగనన్నకు చెబుదాం’’ టోల్‌ ఫ్రీ నంబరు 1902కి ఫోన్‌ కొట్టండి.. నేరుగా సీఎంవో కార్యాలయానికే ఫోన్‌ వస్తుంది.. నా సమస్యగానే భావించి ట్రాక్‌ చేస్తాం.. ఫిర్యాదు పరిష్కారంపై ఎస్‌ఎంఎస్‌, ఐవీఆర్‌ఎస్‌ ద్వారా వస్తుంది.. సమస్య పరిష్కారం ఏ దశలో ఉందో వెబ్‌సైట్లో చూసుకోవచ్చు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అన్న మాటలివి.!! అయితే.. ఇక్కడి పరిస్థితి మరోలా ఉంది.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మహా నగరానికి హామీల మూటలే

పరిపాలనా రాజధాని అంటూ పదేపదే చెబుతున్నారు. వరుస పర్యటనలు చేస్తున్నారు. అయినా...ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలు విశాఖలో పూర్తి కావడం లేదు.  శంకుస్థాపనలు చేసిన ప్రాజెక్టులు కొన్ని పడకేశాయి. మరికొన్ని నత్తనడకన సాగుతున్నాయి. గురువారం సీఎం విశాఖకు వస్తున్న నేపథ్యంలో వీటిపై దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. యాదాద్రి క్షేత్రంలో మహిళా క్షురకులు

మారుతున్న కాలానికి అనుగుణంగా మహిళల్లో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేందుకు యువతులు, గృహిణులు ఉద్యోగాలు, కార్మిక వ్యవస్థలోనే కాకుండా కులవృత్తుల్లో సైతం అడగులు వేస్తున్నారు. కొన్ని వృత్తులు మగవారికే వారసత్వంగా కొనసాగుతున్నా, కొన్ని చోట్ల సందర్భాలను బట్టి మార్పులు వస్తున్నాయి. నాదస్వరం వాయిద్యంలో కల్యాణకట్టల్లో వృత్తిపరమైన విధులు నిర్వహిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కష్టాలు విన్నా.. మీ వెంటే ఉంటా

కళ్లాల్లో తిరుగుతూ.. తడిసిన ధాన్యం రాశులు చూస్తూ.. రైతుల వెతలు వింటూ.. అండగా మేమున్నామని భరోసా ఇస్తూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటన సాగింది.. అకాల వర్షంతో పంటలు నష్టపోతే ప్రభుత్వం పట్టించుకోలేదని.. అధికారులు తొంగిచూడలేదని అసంతృప్తి వ్యక్తంచేశారు. నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగేలా.. ప్రతి గింజకూ పరిహారం దక్కేలా జనసేన పోరాడుతుందని భరోసా ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Hyderabad: మహానగరంపై ఉగ్ర నీడలు

శాంతియుత వాతావరణానికి కేరాఫ్‌.. అంతర్జాతీయ వేదికపై ఘన కీర్తి. శతాబ్దాల చరిత్ర ఉన్న నగరాన్ని ఉగ్ర నీడలు ఉలికిపాటుకు గురిచేస్తున్నాయి. గతేడాది దసరా రోజు మారణ హోమం సృష్టించాలనుకున్న నలుగురు లష్కరే తోయిబా ఉగ్రవాదులను ముందుగానే గుర్తించి కట్టడిచేశారు. వారి వద్ద చైనా మేడ్‌ గ్రనేడ్లు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా హజ్బ్‌ ఉత్‌ తహరీర్‌(హెచ్‌యూటీ) ఉగ్రవాద సంస్థకు చెందిన ఆరుగురిని అరెస్ట్‌ చేశారు. నగర టాస్క్‌ఫోర్స్‌ సాయంతో నిఘా సంస్థలు ముందుగానే ముప్పును పసిగట్టి నిలువరించగలిగాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని