Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తల

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 26 Feb 2024 09:03 IST

1. స్వామీ.. నీ భూమి స్వాహా

రాజధాని పరిధిలో దేవాలయాల భూములకు రక్షణ కరవైంది. భూములపై నిఘా ఉండకపోవడం, కంచెలు వేసి హద్దులు గుర్తించకపోవడంతో అనేక భూములు ఇప్పటికే అన్యాక్రాంతమయ్యాయి. మరికొన్ని కోర్టు వివాదాల్లో చిక్కుకున్నాయి. కొన్నిచోట్ల ఖాళీ మైదానాల్లో గుడిసెలు వేసి ఆక్రమించుకొని తరువాత శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారు. అధికారులు ఖాళీ చేయాలంటూ నోటీసులతో సరిపెడుతున్నారు. పూర్తి కథనం

2. గ్రూప్‌-1కు ఇదిగో వ్యూహం!

టీఎస్‌పీఎస్‌సీ 563 గ్రూప్‌- 1 ఉద్యోగాలతో కొత్త నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రిలిమినరీ పరీక్షను మే లేదా జూన్‌ నెలలో నిర్వహిస్తామనీ, మెయిన్స్‌ సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో ఉంటాయని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే ప్రిలిమినరీ జూన్‌ నెలలో జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి పకడ్బందీ ప్రణాళిక ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం! పూర్తి కథనం

3. ఎండకి... రంగు మారితే...

వేడి దంచేస్తోంది కదా! రోజూ కొద్దిసేపు అలా బయటికి వెళ్లొచ్చినా చాలు. చర్మం రంగు మారిపోతుంది. ట్యాన్‌ పట్టేసిందని తెగ తిట్టేసుకుంటాం. కానీ చర్మకణాలను యూవీ కిరణాల బారి నుంచి రక్షించే ప్రక్రియే ఇది. ఎంత మంచిదైనా చర్మం భిన్న రంగుల్లో కనిపిస్తోంటే ఏం బాగుంటుంది? ట్యాన్‌ని తేలిగ్గా పోగొట్టుకునే ఈ చిట్కాలను పాటిస్తే సరి. పూర్తి కథనం

4. చరవాణి పోయిందా.. రాబట్టుకోవచ్చిలా!

చేతిలో చరవాణి లేకుంటే నిమిషం గడపలేని కాలమిది. అలాంటి స్మార్ట్‌ఫోన్‌ ఎక్కడైనా పోయిందంటే తిరిగిరాబట్టేందుకు సీఈఐఆర్‌ అనే ప్రక్రియను అందుబాటులోకి తెచ్చింది పోలీసు శాఖ. ఇప్పటికీ ఎంతో మంది బాధితులకు పోగొట్టుకున్న చరవాణులను సైతం అప్పగించింది. పూర్తి కథనం

5. ఫ్లెక్సీలు చూసినా..వైకాపాకు వణుకు

తెదేపా బ్యానర్లను చూసినా వైకాపా నేతల్లో వణుకు పుడుతోంది. కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో తెదేపా నేతలు బ్యానర్లు కడితే చాలు.. వాటిని చూసి తట్టుకోలేక.. అధికారులను పంపించి తొలగిస్తున్నారు. మరోవైపు తమ అనుచరులను ఉసిగొల్పి వాటిని చించేస్తున్నారు. చివరికి తమ పార్టీలోని ప్రత్యర్థి వర్గాలు బ్యానర్లను కట్టినా ఉలిక్కిపడుతూ వెంటనే వాటిని కూడా తొలగించమని అధికారులను ఆదేశిస్తున్నారు. పూర్తి కథనం

6. మలేరియా ఆయువుపట్టు తెలిసింది..!

జీవుల మనుగడకు అనేక పదార్థాలు అవసరం. వాటిలో కొన్నింటిని ఆయా జీవులే స్వయంగా తయారుచేసుకుంటాయి. మానవుల్లోనూ ఇలానే జరుగుతుంది. అన్ని జీవులకూ ఈ సామర్థ్యం ఉండదు. మలేరియా కారక పరాన్నజీవి ఈ కోవకే చెందుతుంది. తన ఉనికికి అవసరమైన కొన్నిరకాల ఫ్యాటీ ఆమ్లాలను ఇది తయారుచేసుకోలేదు. వాటిని మానవుల నుంచి పొందుతుంది. ఆ పదార్థాలను దానికి అందకుండా చేస్తే ఈ పరాన్నజీవి మనుగడ కష్టమవుతుందని అమెరికాలోని వర్జీనియా టెక్‌  విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గుర్తించారు. పూర్తి కథనం

7. పని చేయండి.. ఎక్కడనేది నిర్ణయిస్తా!

పార్టీ అధిష్ఠానం నుంచి వచ్చిన పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును విశాఖ పార్లమెంటు నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీలు కలిశారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేసే తెదేపా-జనసేన అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన నేపథ్యంలో ఈ ఘటన రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. పూర్తి కథనం

8. జగనన్నా.. హామీలు గుర్తున్నాయా?

‘మాట తప్పం.. మడమ తిప్పం’ అని గుక్క తిప్పుకోకుండా చెబుతారు. ‘రాజకీయాల్లో విశ్వసనీయత ఉండాలి’ అంటూ జగన్‌ చెప్పడం పరిపాటిగా మారింది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నాలుగుసార్లు చిత్తూరు జిల్లాకు వచ్చిన ఆయన వేలాది మంది ప్రజల సాక్షిగా ఆయా నియోజకవర్గాల్లో పలు హామీలు ఇచ్చారు. విశ్వసనీయత గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ఆయన.. సభ ముగిసిన తర్వాత షామియానాలు సర్దేసినట్లు హామీలను మడతపెట్టేశారు. పూర్తి కథనం

9. Kakinada: కాకినాడలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. నలుగురి మృతి

కాకినాడ జిల్లాలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. ప్రత్తిపాడు మండల పరిధిలోని పాదాలమ్మ గుడి వద్ద జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. ఒడిశా నుంచి బాపట్ల వైపు వెళ్తున్న లారీ టైరు పంక్చర్‌ కావడంతో రహదారి పక్కనే నిలిపివేసి మరమ్మతులు చేస్తున్నారు. అదే సమయంలో విశాఖ నుంచి రాజమహేంద్రవరం వైపు వెళ్తున్న ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు.. ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. పూర్తి కథనం

10. పరస్పర అంగీకారం.. ప్రాణాలు నిలబెడదాం

అవయవదానంలో మరో ముందడుగు పడనుంది. రెండు వేర్వేరు కుటుంబాలకు చెందిన వ్యక్తుల మధ్య అంగీకారంతో జరిగే స్వాప్‌ కిడ్నీ(పెయిర్డ్‌ కిడ్నీ) మార్పిడికి సంబంధించి కొత్త రిజిస్ట్రీని ప్రారంభించే యోచనలో జీవన్‌దాన్‌ ట్రస్టు ఉంది. ఇది మూత్రపిండాల రోగులకు అది పెద్ద సాంత్వనే. ప్రస్తుతం మూత్రపిండాల మార్పిడికి భార్య, భర్త లేదంటే రక్త సంబంధీకులను మాత్రమే అనుమతిస్తారు. పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని