గ్రూప్‌-1కు ఇదిగో వ్యూహం!

టీఎస్‌పీఎస్‌సీ 563 గ్రూప్‌- 1 ఉద్యోగాలతో కొత్త నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రిలిమినరీ పరీక్షను మే లేదా జూన్‌ నెలలో నిర్వహిస్తామనీ, మెయిన్స్‌ సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో ఉంటాయని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

Updated : 26 Feb 2024 00:54 IST

టీఎస్‌పీఎస్‌సీ 563 గ్రూప్‌- 1 ఉద్యోగాలతో కొత్త నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రిలిమినరీ పరీక్షను మే లేదా జూన్‌ నెలలో నిర్వహిస్తామనీ, మెయిన్స్‌ సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో ఉంటాయని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే ప్రిలిమినరీ జూన్‌ నెలలో జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీనికి పకడ్బందీ ప్రణాళిక ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం!

ప్రకటించిన 563 ఉద్యోగాలకు గాను దాదాపు 200కి పైగా మంచి కెరియర్‌ ఉండే పోస్టులు ఉండటం విశేషం. అందువల్ల సివిల్స్‌ రాసే అభ్యర్థులతో పాటు సీనియర్‌ అభ్యర్థులు, తాజా అభ్యర్థులు పోటీ క్షేత్రంలో దీటుగా పోటీపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

 దీనికి తోడు యూనిఫాం ఉద్యోగాలు తప్ప మిగతా ఉద్యోగాలు అన్నిటికీ గరిష్ఠ వయసు 46 సంవత్సరాలుగా పేర్కొనడంతో ఆశలు పెట్టుకున్న అభ్యర్థులందరికీ అవకాశాలు ఏర్పడినట్లు అయింది. అదేవిధంగా పాత ఉద్యోగాలు.. కొత్త ఉద్యోగాలపై తాజా అభ్యర్థులకు కూడా అవకాశం ఉండటంతో పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఇటువంటి నేపథ్యంలో వివిధ రకాల అభ్యర్థులు ఏ విధమైన ప్రణాళిక అనుసరించాలో పరిశీలిద్దాం.

తాజా అభ్యర్థులు

19-2-24 నాటికి డిగ్రీ పాసైన అందరూ అర్హులే అని నిర్ణయించడంతో ఇటీవల పాస్‌ అయిన అభ్యర్థులు అందరూ కూడా గ్రూప్‌-1 పరీక్షను రాయవచ్చు. గ్రాడ్యుయేషన్‌ పాస్‌ అయి ఉండాలి గానీ ఫస్ట్‌ క్లాస్‌ లాంటి నిబంధనలు ఏమీ లేవు. అందువల్ల గ్రాడ్యుయేషన్‌ అర్హత 19-2-24 నాటికి పొందిన ప్రతి ఒక్కరూ ఈ పరీక్ష రాయవచ్చు.

తాజా అభ్యర్థులు ముందుగా ప్రిలిమినరీ పరీక్షపై పట్టు సాధించాలి. జూన్‌ నాటికి పరీక్ష జరిగే అవకాశం ఉన్నందున పూర్తి సమయాన్ని ప్రిపరేషనుకు వినియోగించినప్పుడే మెయిన్స్‌ అవకాశాలు ఉంటాయి. అందువల్ల ప్రిలిమినరీలోని 13 విభాగాలను చదవాల్సి ఉంటుంది. అందులో స్కోరింగ్‌ విభాగాలైన పాలిటీ, మెంటల్‌ ఎబిలిటీ, జాగ్రఫీ, కరెంట్‌ అఫైర్స్‌, చరిత్ర మొదలైన అంశాల్ని లోతుగా చదవాలి. మిగతా విషయాలపై కూడా స్థూల అవగాహన ఏర్పరచుకోవాలి. పరీక్షకు ముఖ్యమైన అంశాలను గుర్తించి తయారవడం ద్వారా మెరుగైన ఫలితాలు వస్తాయి. అదే సందర్భంలో ప్రిలిమినరీలో చదివే అనేక అంశాలు మెయిన్స్‌లో సమాధానం రాసేందుకు కావలసిన బేసిక్స్‌నూ, విషయ అవగాహననూ ఏర్పరుస్తాయి. ఇది గమనించి ప్రిలిమినరీని నిర్లక్ష్యం చేయకుండా ఎక్కువ సమయం కేటాయిస్తే అది తెలివైన నిర్ణయం అవుతుంది.  

ప్రిలిమినరీలో స్కోరును పెంచుకునేందుకూ, మెయిన్స్‌లో బాగా రాణించేందుకూ తప్పనిసరిగా దృష్టి పెట్టాల్సిన అంశాలు- తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ సమాజం- సంస్కృతి, వారసత్వం, కళలు, తెలంగాణ పాలసీలు మొదలైనవి. వీటిని ప్రిలిమినరీతో పాటు మెయిన్స్‌కు అనుసంధానం చేసుకునే విధంగా అధ్యయన ప్రణాళిక అవసరం.

మెయిన్స్‌లో పేపర్ల వారీగా ఇప్పుడే ప్రిపేర్‌ అవ్వాలా వద్దా అనేది ఈ సందర్భంలో వచ్చే ఒక సందేహం. ఒక పేపర్‌లో ఉండే మొత్తం సిలబస్‌ని పరిశీలించుకుని అందులో ఏ అంశాలు ప్రిలిమినరీతో ముడిపడి ఉన్నాయో వాటిని ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ కోణంలో ప్రిపేర్‌ అవటం సమంజసం. ఎందుకంటే ప్రిలిమ్స్‌కూ, మెయిన్స్‌కూ మధ్య మూడు నెలల సమయం మాత్రమే ఉండే అవకాశం ఉంది.

ఇలాంటప్పుడు మూడు నెలల్లో 6 పేపర్లను మెయిన్స్‌ కోణంలో చదవడం నిజంగా కష్టమైన విషయమే. మెయిన్స్‌లో ఆన్సర్‌ రాసే విధానంపై పట్టు దొరకాలంటే ఇప్పటినుంచి ప్రిలిమినరీతో సంబంధమున్న మెయిన్స్‌ టాపిక్స్‌ని ప్రిలిమ్స్‌ మెయిన్స్‌ ఇంటిగ్రేటెడ్‌ పద్ధతిలో చదువుకోవటం మంచిది. అదేవిధంగా పాత ప్రశ్నపత్రాలు తీసుకుని ప్రిలిమినరీ బిట్స్‌ అయినా మెయిన్స్‌ ప్రశ్నలు.. అందుకు తగిన రీతిలో రాసే సమాధానంపై అవగాహన పెంచుకోవడం సరైన కాలంలో సరైన నిర్ణయం అవుతుంది.

సీనియర్లు

సీనియర్‌ అభ్యర్థుల్లో అందరికీ ఒకే రకమైన పరిస్థితులు లేవు. వారిలో కూడా చాలా భిన్నత్వాలు కనిపిస్తున్నాయి.  

  ప్రిలిమినరీనీ, మెయిన్స్‌నీ గత కొన్ని సంవత్సరాలుగా చదువుతూ విపరీతమైన పట్టు కలిగిన అభ్యర్థులు ఒక రకం. ఇలాంటి అభ్యర్థులు కంటెంట్‌ పరంగా చాలా బలంగా ఉంటారు. కాబట్టి ప్రిలిమినరీ 45 రోజుల ముందు వరకు మెయిన్స్‌ ప్రశ్నలకు సమాధానాలు రాస్తూ సరైన రీతిలో సమాధానాలు ఉన్నాయా లేవా అని మరింతగా సాన పెట్టుకోవడం అవసరం. అనేక సబ్జెక్టుల్లో గత సంవత్సర కాలంలో వచ్చిన మార్పులను కూడా అర్థం చేసుకుని సమాధానాల్లో ఇంటిగ్రేట్‌ చేసుకునేందుకు ఇది ఒక మంచి అవకాశం. అందువల్ల సరైన గైడెన్స్‌ పొందుతూ సమాధానాన్ని మూల్యాంకనం చేయించుకుని లోపాలను సరిదిద్దుకోవాలి. ఇలా చేయగలిగితే రాష్ట్రస్థాయి ఉన్నత ఉద్యోగాల్లో చేరటం ఖాయమైనట్లే.

గత ఒకటిన్నర సంవత్సరాలుగా సిద్ధమవుతున్న అభ్యర్థులు మరొక రకం. వీరికి కూడా మెయిన్స్‌పై మంచి పట్టే ఉంటుంది కానీ పూర్తి పరిపక్వత స్థాయి పట్టు ఉండదు. అందువల్ల ఈ తరహా అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్ష 45 రోజులు ముందు వరకు మెయిన్స్‌ కంటెంట్‌పై అధిక దృష్టి నిలుపుతూ టెస్టులు ప్రాక్టీస్‌ చేయటం మంచిది. అంటే కంటెంట్‌ మెరుగుదల ఉండాలి. వివరణాత్మక ప్రశ్నలకు సమాధాన నిపుణత కలిగి ఉండాలి. అందుకోసం ఈ సమయాన్ని వినియోగించుకోవడం మంచిది.

  సీనియర్లలో మరొక రకం- అటు సివిల్స్‌ ప్రిపేర్‌ అవుతూ ఇటు గ్రూప్‌-1 రాయాలనుకునే వర్గం. వీరు సివిల్స్‌లో రెండు మూడు సంవత్సరాలుగా కష్టపడుతూ సివిల్స్‌కి ప్రత్యామ్నాయంగా గ్రూప్‌-1 పరీక్ష ఎంచుకుంటారు. ఇలాంటి వారు ఈ సంవత్సరం అక్టోబర్‌ లోపుగా ప్రిలిమినరీ, మెయిన్స్‌ పూర్తి అవుతాయి కాబట్టి అటు సివిల్స్‌పై దృష్టి పెట్టాలా..ఇటు గ్రూప్‌-1పై దృష్టి పెట్టాలా అనే  మీమాంసతో ఉంటారు. ఇలాంటి అభ్యర్థులు నిష్పక్షపాతంగా సివిల్స్‌లో విజయావకాశాలను ఒకసారి ధ్రువీకరించుకుని ఏదో ఒకటి ఎంపిక చేసుకోవడం సబబు. వాళ్లకి మిగిలిన ప్రయత్నాలు, గతంలో రాసిన మెయిన్స్‌ అనుభవాలు ఈ సందర్భంగా సమీక్షించుకుని రాష్ట్ర గ్రూప్‌-1పై దృష్టి నిలపటం హేతుబద్ధమైన విషయం.

  ఒకవేళ సివిల్స్‌ని తాజాగా ప్రయత్నిద్దామనుకునే అభ్యర్థులు ఈ సంవత్సరానికి గ్రూప్‌-1కే పరిమితమై ప్రిపేర్‌ అవ్వటం మంచి నిర్ణయమే! సమాధానాలు రాసేటప్పుడు సివిల్స్‌ సమాధానాలు కొంత స్థానికీకరణం చెందాల్సి ఉంటుంది. ఇది కంటెంట్‌లో కావచ్చు,  రాసే సమాధాన పద్ధతిలో కావచ్చు. సివిల్స్‌ పరీక్షలకూ,  గ్రూప్‌-1 పరీక్షలకూ మెయిన్స్‌లో రాసే విధానంలో కొన్ని స్పష్టమైన తేడాలు ఉన్నాయి. వాటిని అర్థం చేసుకొని సాధన చేసేందుకు ప్రణాళిక రచించుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని