Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 11 Jun 2024 09:04 IST

1. అమాత్యయోగం ఎవరికి?

తెదేపా అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు సమయం ఆసన్నమైంది. రెండు రోజులు దిల్లీలో ఉన్న చంద్రబాబు సోమవారం అమరావతి చేరుకున్నారు. మంత్రివర్గ కూర్పుపై ముఖ్య నేతలతో చర్చించారు. తెదేపా అధినేత బుధవారం ప్రమాణస్వీకారం చేయనున్నందున ఆయన కేబినెట్‌లో ఎవరెవరికి చోటు దక్కనుందన్న అంశంపై జిల్లాలో ఉత్కంఠ నెలకొంది. ప్రధానంగా సీనియారిటీ, సామాజిక సమీకరణాలు, కష్టకాలంలో అండగా ఉన్న వ్యక్తులకు ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి కథనం.

2. ఆకాశమే హద్దుగా..

గన్నవరం విమానాశ్రయానికి మళ్లీ మంచిరోజులొచ్చాయి. తెదేపా ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో అభివృద్ధి పరుగులు తీయబోతోంది. 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు గన్నవరంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆయన హయాంలోనే రికార్డుస్థాయిలో కేవలం 11 నెలల వ్యవధిలో రూ. 160 కోట్లతో దేశీయ టెర్మినల్‌ భవనాన్ని నిర్మించారు. పూర్తి కథనం.

3. పరారీలోనే పిన్నెల్లి తమ్ముడు

అధికారం చేతిలో ఉందని నాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డి విర్రవీగారు.. అప్పట్లో ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఇష్టానుసారం దాడులకు దిగారు. ఎన్నికల రోజే కాకుండా మరుసటి రోజు కూడా దాడులకు పాల్పడటంతో ఇద్దరిపై హత్యాయత్నం కేసులు సైతం నమోదయ్యాయి. వారాలు గడుస్తున్నా మాచర్ల అల్లర్ల కేసుల్లో పురోగతి లేదు. పూర్తి కథనం.

4. పేర్ని నాని అవినీతి ఆధారాలతో నిరూపిస్తా

అవినీతిపరుడైన మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) చేసిన అన్ని అరాచకాలను తగు ఆధారాలతో నిరూపిస్తానంటూ జనసేన నాయకుడు కొరియర్‌ శ్రీను హెచ్చరించారు. సోమవారం బందరు పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పేర్ని తీరుపై నిప్పులు చెరిగారు. తాను వైకాపాలో ఉన్నంత కాలం అవసరార్థం వాడుకుని, అక్రమాలను ప్రశ్నిస్తున్నాన్న కారణంతో తనపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టించారన్నారు. పూర్తి కథనం.

5. చెవిరెడ్డి మెడకు ఉచ్చు?

పోలింగ్‌ రోజు, తర్వాత రోజు చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల్లో చోటుచేసుకున్న పరిణామాలపై సిట్‌ తాజా ఆదేశాలతో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, అతని కుమారుడు మోహిత్‌రెడ్డిల మెడకు ఉచ్చు బిగుసుకోనుంది. తిరుపతి శ్రీపద్మావతి మహిళ విశ్వవిద్యాలయంలో చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై దాడికి ప్రేరేపించిన వ్యక్తులను గుర్తించేందుకు కాల్‌డేటా రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాలని సిట్‌ అధికారులు అభిప్రాయపడ్డారు. పూర్తి కథనం.

6. షిరిడీ కోసం బురిడీ

ఆడిందే ఆట.. పాడింతే పాటగా ఉంది విద్యుత్తు శాఖలో నియంత్రికల కొనుగోలు వ్యవహారం. ప్రభుత్వం ఏ పని చేపట్టాలన్నా అది ప్రజలకు ఏ మాత్రం ఉపయోగపడుతుంది.. ఎప్పుడు అవసరమవుతుందనే విషయాలు ఆలోచించాలి.. అయితే వైకాపా ప్రభుత్వ హయాంలో విద్యుత్తు శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండదండలతో ఉన్నతస్థాయి అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారు.. షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్‌ సంస్థకు అడ్డగోలుగా కోట్లాది రూపాయలు దోచిపెట్టేందుకు ప్రస్తుతం అవసరం లేకున్నా ఇష్టానుసారంగా నియంత్రికలు కొనుగోలు చేశారు. పూర్తి కథనం.

7. 60 వేల మందికి భోజన పొట్లాలు

రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈనెల 12న నగర శివారు గన్నవరం మండలం కేసరపల్లి ప్రాంతంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అవసరమైన ఏర్పాట్లను నగరపాలక సంస్థ చూస్తోంది. కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌తో పాటు, ఇంజినీరింగ్, ప్రజారోగ్యం, ఉద్యాన, ఇతర విభాగాల అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. విజయవాడ నుంచి గన్నవరం వరకు ప్రత్యేకంగా పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తున్నారు. పూర్తి కథనం.

8. పార్టీ విధేయుడికి హోంశాఖ సహాయ మంత్రి

బండి సంజయ్‌.. ఇక హోంశాఖ సహాయ  మంత్రిగా వ్యవహరించనున్నారు. కరీంనగర్‌ ఎంపీగా రెండోసారి గెలిచిన సంజయ్‌కి శాఖల కేటాయింపులో సముచిత స్థానమే దక్కింది. ముఖ్యంగా అమిత్‌షా హోంశాఖ కేంద్రమంత్రిగా మళ్లీ పగ్గాలు చేపట్టడంతో ఆయన నేతృత్వంలో సహాయ మంత్రిగా బండి బాధ్యతలు చేపట్టనున్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక.. ఏ శాఖను కేటాయిస్తారో అనే ఉత్కంఠ అందరిలో కనిపించింది. పూర్తి కథనం.

9. చెత్త వేస్తే.. కెమెరా పట్టేస్తుంది

నగరంలో ప్రస్తుతం 2,300 చెత్త కుప్పలు ఉన్నాయి. ఇంటింటిలో చెత్త సేకరణకు 4,500 స్వచ్ఛ ఆటోలు రోజూ వెళ్తున్నాయి. అయినా ఏ వీధిలో చూసినా చెత్తకుప్పలే కనిపిస్తున్నాయి. ఈ చెత్తే భారీ వర్షాలు పడితే నాలాల్లోకి చేరి వరద ఉద్ధృతిని పెంచేస్తోంది. కాలనీలను ముంచెత్తుతోంది. పూర్తి కథనం.

10. మరో 3 కోట్ల పేదల ఇళ్లు.. కేంద్ర క్యాబినెట్‌ తొలి సమావేశంలో నిర్ణయం

దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేదల నివాస అవసరాలను తీర్చడానికి ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద మరో 3 కోట్ల ఇళ్లు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర క్యాబినెట్‌ ఆదివారం కొలువుదీరాక సోమవారం జరిగిన తొలి క్యాబినెట్‌ సమావేశంలో దీనికి ఆమోద ముద్ర పడింది. పూర్తి కథనం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని