Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 05 Sep 2023 09:17 IST

1. తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు.. అత్యధికంగా కురిసిన ప్రాంతాలివే..

తెలంగాణ వ్యాప్తంగా గత రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, మెదక్‌ జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. సోమవారం రాత్రి నుంచి మంగళవారం వేకువజామున 5 గంటల వరకు కురిసిన వర్షపాతం వివరాలను తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికా సంఘం (టీఎస్‌డీపీఎస్‌) ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రజినీకాంత్‌ డైలాగ్‌లు మమ్మల్ని ఉద్దేశించినవి కావు: మంత్రి రోజా

ప్రముఖ సినీనటుడు రజినీకాంత్‌ ఇటీవల జైలర్‌ సినిమా విడుదల వేడుకలో చెప్పిన డైలాగ్‌లు తమను ఉద్దేశించి చేసినవి కావని మంత్రి రోజా అన్నారు. సోమవారం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. రజినీకాంత్‌ ఎవరినో ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను జనసేన కార్యకర్తలు తమకు అన్వయిస్తూ సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్‌ చేశారని ఆరోపించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఈసారి ఆంగ్ల మాధ్యమ టీచర్‌ పోస్టులుండవ్‌.. టీఆర్‌టీపై విద్యాశాఖ నిర్ణయం

ప్రభుత్వం చేపట్టనున్న టీచర్స్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ (టీఆర్‌టీ)లో ఈసారి ప్రత్యేకంగా ఆంగ్ల మాధ్యమం ఉపాధ్యాయ పోస్టులుండవు. తెలుగు, ఆంగ్ల మాధ్యమం అనే ప్రస్తావన లేకుండానే త్వరలో నోటిఫికేషన్‌ ఇవ్వనున్నారు. 2017లో 8,792 ఖాళీల భర్తీకి నిర్వహించిన టీఆర్‌టీలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ కొలువులకు తెలుగు, ఆంగ్ల మాధ్యమంతో పాటు ఉర్దూ, హిందీ, కన్నడ, మరాఠీ, తమిళం, బెంగాలీ మాధ్యమ పోస్టులు కూడా ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఖైదీల రోజు కూలి రూ.30

తెలంగాణ జైళ్లలోని ఖైదీల రోజువారీ వేతనమెంతో తెలుసా..? కనిష్ఠంగా రూ.30. రాష్ట్రంలోని కారాగారాల్లో నైపుణ్యం లేని(అన్‌ స్కిల్డ్‌) ఖైదీలకు ఇచ్చే కూలి ఇదే. అదే ఓ మోస్తరు నైపుణ్యం ఉన్న వారికి (సెమీ స్కిల్డ్‌) రూ.50, నైపుణ్యముంటే (స్కిల్డ్‌) రూ.70 చెల్లిస్తున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లాంటి చిన్న రాష్ట్రాల్లో నైపుణ్యం లేకున్నా రూ.300 ఇస్తున్నారు. ఖైదీలు చేసే ఉత్పత్తుల విలువలో దేశంలోనే రెండో స్థానంలో నిలుస్తున్న తెలంగాణలో కనీస కూలి దక్కకపోవడం ఖైదీల్లో ఆందోళన కలిగిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అమెరికాలో లక్ష మంది భారతీయ పిల్లలు తల్లిదండ్రులకు దూరం?

అమెరికాలో దాదాపు లక్ష మంది భారతీయ పిల్లలు అక్కడ ఉన్న తమ తల్లిదండ్రులకు దూరమయ్యే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. గ్రీన్‌ కార్డుల జారీలో తీవ్ర జాప్యమే ఇందుకు కారణం. హెచ్‌1బీ వీసాపై అమెరికాలో ఉంటున్న వారి పిల్లలు హెచ్‌-4 వీసా కింద తల్లిదండ్రులతో కలిసి ఉండొచ్చు. అయితే వీరు తమ వయసు 21 ఏళ్లు వచ్చే వరకు అమెరికాలో ఉండే అవకాశం ఉంటుంది. డాక్యుమెంటెడ్‌ డ్రీమర్స్‌గా ఇలాంటి వారికి రెండు ఆప్షన్లు ఉంటాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. హైదరాబాద్‌కు రెడ్‌ అలర్ట్‌.. విద్యాసంస్థలకు సెలవు

నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. ఈమేరకు ఇవాళ స్కూళ్లకు సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. కాగా తెలంగాణలోని పలు జిల్లాల్లో మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 7 జిల్లాలకు రెడ్‌ హెచ్చరికలు, 17 జిల్లాలకు ఆరెంజ్‌ హెచ్చరికలు, 9 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పింఛనులోనూ లంచం!

పూర్తి పింఛను ఇవ్వకపోవడమే కాకుండా ప్రశ్నించిన లబ్ధిదారును బెదిరించిన ఘటనిది. బాధిత వృద్ధుడు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం వెంగళాయపల్లికి చెందిన ఏరువ చెంచయ్యకు కరోనా సమయం వరకు వృద్ధాప్య పింఛను వచ్చేది. అప్పట్లో అనారోగ్య కారణాల వల్ల మూడు నెలలు పింఛను తీసుకోకపోవడంతో నిలిచిపోయింది. ఆయన ఆరోగ్యం బాగాలేక హైదరాబాద్‌లోని బంధువుల ఇంటివద్ద ఉంటూ చికిత్స చేయించుకుంటున్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. నత్తి ఎందుకొస్తుంది?

నత్తి చికాకు పెట్టే సమస్య. మాట్లాడటంలో చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఇది గలవారికి చెప్పాలనుకునే విషయమేంటనేది తెలుసు. కానీ చెప్పటానికే ఇబ్బంది పడుతుంటారు. అవే పదాలను వల్లె వేస్తుండొచ్చు. కొన్నిసార్లు ఒక్క అక్షరమే బయటకు రావొచ్చు. మొత్తం పదం, వాక్యం పలకటం కష్టమవుతుంది. నత్తి పిల్లల్లో.. అదీ అబ్బాయిల్లో తరచూ చూస్తుంటాం.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. హైదరాబాద్‌లో మరో గంటపాటు కుండపోత.. వాతావరణశాఖ హెచ్చరిక

హైదరాబాద్‌ సహా పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి, సిద్దిపేట, జనగామ, యాదాద్రి జిల్లాల్లో భారీ వర్షం కురవనున్నట్లు తెలిపింది. హైదరాబాద్‌లో మరో గంటపాటు కుండపోత వర్షం కురిసే అవకాశముందని వెల్లడించింది. పలు చోట్ల 10 సెం.మీ దాటి వర్షపాతం నమోదవుతుందని తెలిపింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఆరోగ్య వర్సిటీలో హైడ్రామా

ఆరోగ్య విశ్వవిద్యాలయంలో నకిలీ పీజీ వైద్య సీట్ల వల్ల రద్దు చేసిన మొదటి విడత కౌన్సెలింగ్‌ ప్రక్రియను సోమవారం పునః ప్రారంభించారు. నకిలీ సీట్లను తొలగించి మళ్లీ కౌన్సెలింగ్‌ పెట్టడంతో అంతా గందరగోళంగా మారింది. నంద్యాల శాంతిరామ్‌, రాజమహేంద్రవరం జీఎస్‌ఎల్‌ వైద్య కళాశాలలకు కొత్తగా మంజూరైనట్టు చూపించి, కౌన్సెలింగ్‌లో పెట్టిన 113 నకిలీ సీట్లను తొలగించి.. కొత్తగా ప్రవేశాల ప్రక్రియ మొదలుపెట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని