నత్తి ఎందుకొస్తుంది?

నత్తిని ఉన్నట్టుండి తగ్గించే మందేదీ లేదు. కానీ వీరికి స్పీచ్‌ థెరపీ బాగా ఉపయోగ పడుతుంది. ఈ చికిత్సతో పాటు ఇంట్లో పిల్లలకు మాట్లాడటంలో కొంత శిక్షణ ఇస్తే మరింత ప్రయోజనం కనిపిస్తుంది.

Published : 05 Sep 2023 01:23 IST

నత్తి చికాకు పెట్టే సమస్య. మాట్లాడటంలో చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఇది గలవారికి చెప్పాలనుకునే విషయమేంటనేది తెలుసు. కానీ చెప్పటానికే ఇబ్బంది పడుతుంటారు. అవే పదాలను వల్లె వేస్తుండొచ్చు. కొన్నిసార్లు ఒక్క అక్షరమే బయటకు రావొచ్చు. మొత్తం పదం, వాక్యం పలకటం కష్టమవుతుంది. నత్తి పిల్లల్లో.. అదీ అబ్బాయిల్లో తరచూ చూస్తుంటాం. ముఖ్యంగా 2-5 ఏళ్ల వయసులో ఎక్కువ. పెద్దవారిలో సుమారు ఒక శాతం మందిలో, పిల్లల్లో దాదాపు 5% మందిలో కనిపిస్తుంటుంది. సాధారణంగా నత్తి గల పిల్లలు 70 నుంచి 90 శాతం మంది ఏడేళ్ల వయసుకు వచ్చేసరికి వాళ్లంతట వారే బయటపడుతుంటారు. పెద్దవారిలో హఠాత్తుగా నత్తి రావటం అరుదు.
ఇంతకీ పిల్లలకు నత్తి ఎందుకొస్తుంది? నిజానికి వీళ్లు తెలివి గలవారు. కొన్నిసార్లు ఆలోచనల కన్నా మాట్లాడటానికి అవసరమైన కండర కదలికల సమన్వయ వేగం తక్కువగా ఉండొచ్చు. అంటే మాట్లాడే వేగం కన్నా ఆలోచనల వేగం పెరిగినప్పుడు పదాలు, వాక్యాలు నత్తి నత్తిగా వస్తుంటాయి. దీంతో గాబరా, ఆదుర్దాకు లోనవుతారు. సమస్య తీవ్రమవుతూ వస్తుంటుంది. నత్తికి కొంతవరకు జన్యువులూ దోహదం చేయొచ్చు. కొన్ని కుటుంబాల్లో ఎక్కువ మందికి నత్తి ఉండటం చూస్తుంటాం. ఇది ఒత్తిడి, ఆందోళనకు గురైనప్పుడు మరింత ఎక్కువవుతుంది. కొందరికి అనుకరణతోనూ నత్తి అంటుకోవచ్చు.


మాటలతో సాధన

నత్తిని ఉన్నట్టుండి తగ్గించే మందేదీ లేదు. కానీ వీరికి స్పీచ్‌ థెరపీ బాగా ఉపయోగ పడుతుంది. ఈ చికిత్సతో పాటు ఇంట్లో పిల్లలకు మాట్లాడటంలో కొంత శిక్షణ ఇస్తే మరింత ప్రయోజనం కనిపిస్తుంది.

  • నోటి నుంచి మాటలు వెలువడటానికి ముందే మెదడులో వాక్యాలు ఏర్పడతాయి. కాబట్టి నెమ్మదిగా మాట్లాడేలా అలవాటు చేయటం ముఖ్యం. రాగం తీస్తున్నట్టు మాట్లాడేలా చూడటమూ మంచిదే. నత్తి ఎక్కువగా ఉన్నవారు కూడా పాడేటప్పుడు తడబడరు. అందువల్ల పాటలు పాడటం, గాత్ర సంగీతం నేర్పించాలి.
  • కొందరు నత్తిగా మాట్లాడుతున్నప్పుడు పిడికిలి బిగించటం, కళ్లు మిటకరించటం, కండరాలు బిగించటం వంటివీ చేస్తుంటారు. అందుకే ఆందోళనతో నత్తి వస్తుందని భావిస్తుంటారు. కానీ ఆందోళన తగ్గించే మందులతో ఎలాంటి ఉపయోగమూ ఉండదని బయటపడింది.
  •  నత్తికి తొలిదశలోనే చికిత్స చేయటం మంచిది. లేకపోతే ఆత్మ విశ్వాసం కొరవడే ప్రమాదముంది. నలుగురితో కలవలేక చదువులో వెనకబడొచ్చు. ఉద్యోగాల్లో పూర్తి స్థాయిలో రాణించకపోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని