Tirumala: నడకదారుల్లో పిల్లల అనుమతిపై తితిదే ఆంక్షలు

చిరుతల సంచారం దృష్ట్యా తిరుమల నడకదారుల్లో పిల్లల అనుమతిపై తితిదే ఆంక్షలు విధించింది.

Updated : 13 Aug 2023 19:12 IST

తిరుమల: అలిపిరి కాలినడక మార్గంలో చిరుత దాడుల నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) అప్రమత్తమైంది. శ్రీవారి దర్శనం కోసం కాలిబాటలో వచ్చే భక్తుల భద్రతకు రక్షణ చర్యలు చేపట్టింది. మధ్యాహ్నం 2 గంటల తర్వాత 15 ఏళ్లలోపు పిల్లలను అలిపిరి కాలినడక మార్గంలో అనుమతించడం లేదు. రెండు కనుమ రహదారుల్లో సాయంత్రం ఆరు గంటల తర్వాత ద్విచక్ర వాహనాల రాకపోకలు నిలిపివేశారు. ఏడో మైలు వద్ద చిన్నపిల్లల చేతికి పోలీసు సిబ్బంది ట్యాగ్‌ వేస్తున్నారు. తల్లిదండ్రుల నుంచి పిల్లలు తప్పిపోతే కనిపెట్టేందుకు ట్యాగ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ట్యాగ్‌పై పేరు, తల్లిదండ్రుల వివరాలు, ఫోన్‌ నంబర్, పోలీసు టోల్‌ ఫ్రీ నంబర్‌ పొందుపరుస్తున్నారు.

వన్యప్రాణులు రాకుండా లైటింగ్, సౌండ్‌ సిస్టమ్‌లు!

నెల్లూరు జిల్లా పోతిరెడ్డి పాలేనికి చెందిన బాలిక లక్షితపై చిరుత దాడి చేసి చంపేయడంతో తితిదే ఈ మేరకు రక్షణ చర్యలు చేపట్టింది. దాడికి పాల్పడిన చిరుతను బంధించడానికి బోన్లు ఏర్పాటు చేసింది. సాధారణ పరిస్థితులు ఏర్పడే వరకు భక్తులు ఈ జాగ్రత్తలు తీసుకొనేలా చైతన్యపరుస్తోంది. క్రూర మృగాల సమస్య పరిష్కారమయ్యే వరకు భక్తులు సహకారం అందించాలని తితిదే కోరింది. అలాగే నడకదారి మార్గంలో అడవి మృగాలు సంచరించే ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయో గుర్తించి.. వన్యమృగాలు నడకదారి దగ్గరకు రాకుండా ఉండేందుకు అవసరమైన సెంట్రీ పోస్టులు, సీసీ కెమెరాలు, ఫెన్సింగ్ వంటివి ఏర్పాటు చేస్తున్నారు. జంతువులు వస్తే దూరంగా తరిమేందుకు అవసరమైన లైటింగ్ సిస్టం, సౌండింగ్ సిస్టమ్‌లను సిద్ధం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని