Andhra News: ప్రస్తుతం ఏపీ రాజధాని అమరావతే: రాజ్యసభలో కేంద్ర మంత్రి ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌కు అమరావతే రాజధాని అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యసభలో భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ..

Updated : 02 Feb 2022 12:44 IST

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు అమరావతే రాజధాని అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యసభలో భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ఏపీ రాజధాని అంశాన్ని లేవనెత్తారు. రాజధానిపై గందరగోళం నెలకొని ఉందని.. స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. దీనిపై కేంద్రహోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్‌ సమాధానమిస్తూ ప్రస్తుతం ఏపీకి రాజధాని అమరావతే అని చెప్పారు. అయితే రాజధానిని నిర్ణయించే అధికారం రాష్ట్రానిదేనన్నారు. మూడు రాజధానులపై రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు తమ దృష్టికొచ్చిందని చెప్పారు.

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి మూడు రాజధానులు నిర్ణయించింది. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి మూడు రాజధానుల చట్టాన్ని తీసుకొచ్చింది. కొద్దిరోజుల క్రితం ఆ చట్టాల్లో మార్పులు చేస్తామంటూ వాటిని వెనక్కి తీసుకుంటున్నట్లు తెలిపింది. దానికి సంబంధించిన తీర్మానాన్ని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం పొందింది. దీంతో మూడు రాజధానులపై సందిగ్ధత ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాజ్యసభలో ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ఏపీ రాజధానిపై స్పష్టత కోరగా కేంద్రమంత్రి సమాధానమిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని