Jharkhand: జైలులో ఖైదీ హత్య కేసు.. 15మందికి ఉరిశిక్ష

ఝార్ఖండ్‌లోని జెంషెడ్‌పూర్‌లో ఓ ఖైదీ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో 15మందికి మరణదండన.....

Published : 18 Aug 2022 18:44 IST

ఝార్ఖండ్‌లో జిల్లా కోర్టు సంచలన తీర్పు

జెంషెడ్‌పూర్‌: ఝార్ఖండ్‌లోని జెంషెడ్‌పూర్‌లో ఓ ఖైదీ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో 15మందికి మరణదండన విధించింది. జెంషెడ్‌పూర్‌లోని ఘఘిద్‌ సెంట్రల్‌ జైలులో 2019లో రెండు గ్రూపుల మధ్య చెలరేగిన ఘర్షణలో ఓ ఖైదీ హత్యకు గురయ్యాడు. గురువారం ఈ కేసు విచారించిన ఝార్ఖండ్‌లోని ఈస్ట్‌ సింగ్భుమ్‌లోని అదనపు జిల్లా కోర్టు జడ్జి-4 రాజేంద్ర కుమార్‌ సిన్హా ఈ సంచలన తీర్పు ఇచ్చారు. ఐపీసీ సెక్షన్లు 302 (హత్య), 120బి (నేరానికి కుట్ర) కింద 15మందికి ఉరిశిక్ష విధించారని పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రాజీవ్‌ కుమార్‌ వెల్లడించారు. ఈ కేసులో హత్యా ప్రయత్నానికి పాల్పడ్డారంటూ మరో ఏడుగురికి పదేళ్ల పాటు జైలు శిక్షను కూడా విధించారు. అయితే, మరణశిక్ష పడిన వారిలో ఇద్దరు పరారీలో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న ఇద్దరు ఖైదీలను పట్టుకొని తమ ఎదుట హాజరు పరచాలని డీజీపీని కోర్టు ఆదేశించింది. ఆ దోషుల్ని పట్టుకొనేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు కోర్టుకు తెలిపారు.

2019 జూన్‌ 25న సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణల్లో మనోజ్‌ కుమార్‌ సింగ్‌తో పాటు ఇద్దరు ఖైదీలు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మనోజ్‌ కుమార్‌ సింగ్‌ ప్రాణాలు కోల్పోయాడు. ఈ హింసాత్మక ఘటనపై పర్సుదిహ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.  దీనిపై గురువారం విచారించిన న్యాయస్థానం నిందితులకు శిక్షలు ఖరారు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని