Mt Everest: కాళ్లు, చేయి లేకున్నా.. ఎవరెస్టు అధిరోహించి..! సాహసవీరుడి జైత్ర యాత్ర

తన ఆశయాలకు అంగవైకల్యం అడ్డే కాదని భావించిన ఓ యువకుడు.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించాడు.

Published : 23 May 2024 17:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: విధి వంచించింది. ఓ ప్రమాదంలో రెండు కాళ్లు, ఓ చేయి పోయింది. అయితేనేం.. తన ఆశయానికి అంగవైకల్యం అడ్డే కాదని భావించాడు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాన్ని అధిరోహించడమే లక్ష్యంగా పెట్టుకొన్నాడు. ఈ క్రమంలో ఎన్నో సవాళ్లను అధిగమించిన ఆ ముప్పైఏళ్ల యువకుడు.. ఎవరెస్టు శిఖరాన విజయ సంకేతం చూపించి ప్రపంచ రికార్డు సృష్టించాడు.

టింకేశ్‌ కౌశిక్‌.. తొమ్మిదేళ్ల ప్రాయంలోనే కరెంటు షాక్‌తో రెండు కాళ్లు, ఓ చేయి కోల్పోయాడు. కృత్రిమ అవయవాలను వాడుతున్నాడు. కొన్నేళ్ల క్రితం గోవాకు వచ్చిన కౌశిక్‌, ఫిట్‌నెస్‌ కోచ్‌గా పని చేస్తున్నాడు. ఎలాగైనా ఎవరెస్టును అధిరోహించాలని ఆశయంగా పెట్టుకున్న ఆయన.. అందుకోసం తీవ్రంగా శ్రమించాడు. మే 4 నేపాల్‌ నుంచి సాహసయాత్రను మొదలుపెట్టిన ఆయన మే 11న బేస్‌ క్యాంపుపై జాతీయజెండా ఎగురవేశాడు. ఈ క్రమంలో పలు సవాళ్లను ఎదుర్కొన్నట్లు చెప్పాడు.

నిందితుడిని అరెస్టు చేసేందుకు.. ఏకంగా ఎమర్జెన్సీ వార్డుకే పోలీసు వాహనం

‘‘ఫిట్‌నెస్‌ కోచ్‌ అయినందువల్ల ట్రెక్కింగ్‌ చాలా తేలిక అని భావించా. కానీ, దానికి సన్నద్ధమవుతోన్న సమయంలో బేస్‌ క్యాంపు వరకు వెళ్లడం సాహసమేనని గుర్తించా. కానీ, ఎలాగైనా సాధించాలని నిశ్చయించుకున్నా. శారీరక వైకల్యంతోపాటు పర్వతాల్లో ప్రతికూల వాతావరణం కూడా ఎంతో ఇబ్బందిపెట్టింది. అయినప్పటికీ మనోధైర్యంతో ముందుకువెళ్లా. వారం రోజుల పాటు ఈ యాత్ర కొనసాగింది. చివరకు ఎవరెస్టు శిఖరాన్ని చేరుకున్నా. అవి నాకెంతో భావోద్వేగ క్షణాలు’’ అని కౌశిక్‌ వివరించాడు.

మూడు అవయవాలు 90శాతం కోల్పోయి.. ఎవరెస్టును అధిరోహించిన తొలి వ్యక్తిగా కౌశిక్‌ రికార్డు సృష్టించారని గోవా వికలాంగ సంఘం పేర్కొంది. దివ్యాంగులకు ఆదర్శంగా నిలవడంతోపాటు గోవాకు ఇదెంతో గర్వకారణమని ఆ  సంస్థ చీఫ్‌ అవెలినో డిసౌజా అభిప్రాయపడ్డారు. కౌశిక్‌ ఈ ఘనత సాధించడంపై గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ స్పందిస్తూ.. రాష్ట్రం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ విజయం యువతకెంతో స్ఫూర్తిదాయకమని, ఆయనకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తున్నానని ట్వీట్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని