బిహార్‌: 1200 అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులు!

బిహార్‌ ఎన్నికల బరిలో ఉన్న 1200మంది అభ్యర్థులు తమపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు ప్రకటించారు. వీరిలో 115 మంది మహిళలకు సంబంధించిన నేరాలు కాగా, మరో 73 మంది హత్య కేసుల్లో కేసులు ఎదుర్కొంటున్నట్లు ప్రకటించారు.

Published : 02 Nov 2020 21:25 IST

ఏడీఆర్‌ నివేదికలో వెల్లడి

దిల్లీ: బిహార్‌ ఎన్నికల బరిలో ఉన్న 1200మంది అభ్యర్థులు తమపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు ప్రకటించారు. వీరిలో 115 మందిపై మహిళలకు సంబంధించిన నేరాలు కాగా, మరో 73 మంది హత్య కేసుల్లో కేసులు ఎదుర్కొంటున్నట్లు ప్రకటించారు. తాజాగా అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌-ఏడీఆర్‌ నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తోన్న మొత్తం 3722 మంది అభ్యర్థుల్లో 1201 (32శాతం) మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు ఆ‌ నివేదిక పేర్కొంది. వీరిలో 915 మందిపై (25శాతం) తీవ్రమైన క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు తెలిపింది. తీవ్రమైన క్రిమినల్‌ కేసుల్లో నాన్‌-బెయిలబుల్‌ కావడంతో పాటు, ఒకవేళ నేరం రుజువైతే ఐదు సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.

2015లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 3450 మంది అభ్యర్థుల్లో 1038(30శాతం) మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్లు ప్రకటించగా ప్రస్తుతం అది 32శాతానికి పెరిగింది. దీంతో 243 అసెంబ్లీ నియోజకవర్గాలున్న బిహార్‌లో 217 స్థానాలు ‘రెడ్‌ అలర్ట్‌’ స్థానాలుగానే ఏడీఆర్‌ ప్రకటించింది. ఈ స్థానాల్లో పోటీచేస్తున్న వారిలో ముగ్గురు కంటే ఎక్కువ అభ్యర్థులపై తీవ్రమైన నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నట్లు ఏడీఆర్‌ పేర్కొంది.

క్రిమినల్‌ నేరాలు ఉన్నట్లు ప్రకటించిన 37శాతం నుంచి 70శాతం అభ్యర్థులకే రాజకీయ పార్టీలు పోటీచేసేందుకు అవకాశం కల్పించినట్లు ఏడీఆర్‌ వ్యవస్థాపకుడు జగ్‌దీప్‌ ఛోకర్‌ వెల్లడించారు. ఇలాంటి నేరాభియోగాలు ఎదుర్కొంటున్న వారికే పోటీచేసే అవకాశం ఎందుకు కల్పించాల్సి వచ్చింది?, ఎలాంటి నేర చరిత్ర లేనివారికి అవకాశం ఎందుకు ఇవ్వడంలేదని సుప్రీంకోర్టు రాజకీయ పార్టీలను ప్రశ్నించిన విషయాన్ని ఛోకర్‌ తాజా నివేదికలో ప్రస్తావించారు. నివేదికలోని మరిన్ని అంశాలు..

*మహిళలకు సంబంధించిన కేసులు ఉన్న 115 మందిలో 12మంది అత్యాచారం (ఐపీసీ సెక్షన్‌-376) కేసు ఎదుర్కొంటున్న వారే ఉన్నారు.

*ఇక మర్డర్‌ కేసులు ఉన్నవారు (సెక్షన్‌-302) 73 మంది ఉండగా, మరో 278 మంది హత్యాయత్నం (సెక్షన్‌-307) కేసులు ఎదుర్కొంటున్నారు.

*అత్యధికంగా ఆర్‌జేడీ, భాజపా అభ్యర్థుల్లో 70శాతం మందిపై క్రిమినల్‌ కేసులున్నాయి.

*ఆర్‌జేడీకి చెందిన 141 అభ్యర్థుల్లో 98 మందిపై క్రిమినల్‌ కేసులు ఉండగా, భాజపాకు చెందిన 109 మందిలో 76 మందిపై కేసులున్నాయి.

*కాంగ్రెస్‌ నుంచి 64శాతం, ఎల్‌జేపీ నుంచి 52శాతం, జేడీయూ నుంచి 49శాతం, బీఎస్‌పీ నుంచి పోటీచేస్తున్న వారిలో 37శాతం అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయి.

మొత్తం 3722 అభ్యర్థుల్లో 349 మంది జాతీయ పార్టీలు, 470 మంది అభ్యర్థులు రాష్ట్ర స్థాయి పార్టీలకు చెందినవారు కాగా మరో 1607 మంది రిజిష్టర్‌ గుర్తింపుపొందని పార్టీల నుంచి ఉన్నారు. ఇక మరో 1296 మంది స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. ఇక, మొత్తం అభ్యర్థుల్లో 1231 మంది కోటీశ్వరులేనని ఏడీఆర్‌ నివేదిక వెల్లడించింది.

Read latest India News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని