Rahul Gandhi: ప్రధానిగా రాహుల్ ప్రమాణం.. ఏఐ క్లిప్‌ వైరల్‌

ఇటీవల కాలంలో డీప్‌ఫేక్‌ (AI Deepfake) కలకలం సృష్టిస్తోంది. ఎన్నికల వేళ దాని ప్రభావం కనిపిస్తోంది. 

Published : 29 Apr 2024 17:34 IST

దిల్లీ: ‘ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌’ (ఏఐ)(AI) టెక్నాలజీతో రూపొందుతున్న డీప్‌ఫేక్ వీడియోలు, ఆడియోలు ఇటీవల కలకలం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) కి చెందిన ఆడియో క్లిప్ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆయన దేశ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తున్నట్టు అందులో వినిపిస్తోంది. ఆ వాయిస్‌కు తగ్గట్టుగా మ్యూజిక్, దిల్లీలోని ఎర్రకోట దృశ్యాలను జత చేసి.. హస్తం పార్టీ మద్దతుదారులు దానిని షేర్ చేశారు. ‘‘ఆ రోజు త్వరలో రానుంది. జూన్‌ 4న రాహుల్ ప్రధాని అవుతారు’’ అని వ్యాఖ్యలు జోడించారు.

సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ జరుగుతోన్న సమయంలో ఆ ఆడియో నెట్టింట్లో చక్కర్లు కొట్టడం గమనార్హం. కొన్ని డిటెక్షన్‌ టూల్స్ దానిని ఏఐ వాయిస్ క్లోన్‌ అని నిర్ధారించాయి. మొత్తం ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇదిలాఉంటే.. ఇటీవల కూడా కొందరు ప్రముఖ నటులు ఫలానా పార్టీల తరఫున ప్రచారం చేస్తున్నట్లుగా వీడియోలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. తర్వాత అవి నకిలీవని వెల్లడయ్యాయి. వాటి కట్టడికి ఓవైపు కేంద్రం, మరోవైపు సామాజిక మాధ్యమ సంస్థలు చర్యలు చేపడుతున్నా.. నకిలీల బెడద తప్పట్లేదు. ఇక ఎన్నికల సమయంలో ఇలాంటివి మరింత ప్రమాదకర పరిస్థితులకు దారితీసే అవకాశముందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వెంటనే ఏఐ నియంత్రణకు చట్టం తీసుకొచ్చేలా చర్యలు ప్రారంభిస్తామని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ (Ashwini Vaishnaw) వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని