Ajit Doval: ‘ఆర్థిక తోడ్పాటు నిర్మూలనతోనే ఉగ్రవాదం కట్టడి!’

ఉగ్రవాదానికి ఆర్థిక తోడ్పాటే కీలక ఆధారమని, ఈ నేపథ్యంలో.. టెర్రర్‌ ఫైనాన్సింగ్‌ నిర్మూలనకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని భారత భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మధ్య ఆసియా దేశాల ఎన్‌ఎస్‌ఏలు, అధికారులతో దిల్లీలో సమావేశమయ్యారు.

Published : 07 Dec 2022 01:08 IST

దిల్లీ: ఉగ్రవాదానికి ఆర్థిక తోడ్పాటే(Terror Financing) కీలక ఆధారమని, ఈ నేపథ్యంలో.. టెర్రర్‌ ఫైనాన్సింగ్‌ నిర్మూలనకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని భారత భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌(Ajit Doval) పేర్కొన్నారు. మంగళవారం ఆయన మధ్య ఆసియా(Central Asia) దేశాల ఎన్‌ఎస్‌ఏలు, అధికారులతో దిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మధ్య ఆసియాను కీలక ప్రాంతంగా అభివర్ణించిన డోభాల్‌.. అందులోని దేశాలకు భారత్‌ అత్యున్నత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. భారత్‌, మధ్య ఆసియా దేశాల మధ్య వాణిజ్యంతోపాటు సంబంధాల బలోపేతంలో.. ప్రాంతీయ అనుసంధానత కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.

‘ఉగ్రవాద ప్రచారం, నియామకాలు, నిధుల సేకరణ, సీమాంతర ఉగ్రవాదం, సైబర్ స్పేస్, సాంకేతికతల దుర్వినియోగం, డ్రోన్ల ద్వారా మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణా, తప్పుడు సమాచారం వ్యాప్తి వంటివి.. ఉగ్రవాద కట్టడి ప్రయత్నాలకు సవాళ్లుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వాటి పరిష్కారానికి సమష్టి, సమన్వయ చర్యలు అవసరం’ అని సమావేశంలో పాల్గొన్న అధికారులు ఈ సందర్భంగా తీర్మానించారు. ఉగ్రవాద కార్యకలాపాలకు అఫ్గాన్‌ స్వర్గధామంగా మారకుండా చూడాలని ఉద్ఘాటించారు. అయితే.. ఆ దేశ అంతర్గత వ్యవహారాల్లో మాత్రం జోక్యం చేసుకోకూడదని నిర్ణయించినట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని