Ajit Pawar: మోదీని కొనియాడిన అజిత్‌ పవార్‌.. ఎవరితో పోల్చారంటే..?

దివంగత నేత రాజీవ్‌ గాంధీలా ప్రధాని మోదీ కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి కీర్తిని సంపాదించారని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ కొనియాడారు. 

Updated : 02 Aug 2023 12:36 IST

పుణె: దివంగత ప్రధాని రాజీవ్‌ గాంధీ గొప్ప పేరున్న నాయకుడని.. ఆయనలాగే ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రపంచవ్యాప్తంగా అంతే కీర్తిని సంపాదించారని మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ కొనియాడారు. ప్రధాని మోదీ ‘లోక్‌మాన్య తిలక్‌ జాతీయ పురస్కారం’ అందుకున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో అజిత్‌ పవార్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా భాజపా ప్రభుత్వంలో చేరడంపై ఆయన వివరణ ఇచ్చారు.

దివంగత నేతలు రాజీవ్‌ గాంధీ, ఇందిరా గాంధీకి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ఉందన్నారు. అదే విధంగా ప్రధాని మోదీ కూడా ప్రపంచవ్యాప్తంగా అంతే కీర్తిని సంపాదించారని కొనియాడారు. తాను మరో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌తో కలిసి కార్యక్రమానికి వెళ్తుండగా.. ప్రజలంతా రోడ్డుకు ఇరువైపుల నిలబడి ప్రధాని మోదీకి ఘనంగా స్వాగతం పలికారని తెలిపారు. ఎక్కడా వ్యతిరేక నినాదాలు, నల్ల జెండాలు కనిపించలేదన్నారు. ప్రజలు మోదీపై ఆదరణ చూపడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

నిరసనల మధ్యే దిల్లీ బిల్లు

‘‘ఏ ప్రధానమంత్రి అయినా దేశంలో శాంతి భద్రతల గురించి ఆలోచిస్తారు. మణిపుర్‌ ఘటనను ఎవరూ సమర్థించరు. ఈ విషయం ప్రధాని దృషికి వచ్చింది. సుప్రీం కోర్టు కూడా ఈ అంశంపై విచారణ చేపట్టింది. అక్కడ జరిగిన ఘోరాన్ని ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. దోషులకు శిక్ష పడుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హామీ ఇస్తున్నాయి. ప్రధాని మోదీ రోజుకు 18 గంటలు పని చేస్తున్నారు. ప్రతి ఒక్కరు దీపావళి లాంటి పండుగలను తమ కుటుంబంతో కలిసి చేసుకుంటారు. కానీ, ఆయన మాత్రం సరిహద్దులోని సైనికులతో కలిసి వేడుకల్లో పాల్గొంటారు. అంతర్జాతీయ స్థాయిలో మోదీకి ఉన్న పాపులారిటీ మరే నాయకుడికి లేదు. తొమ్మిదేళ్లుగా దేశం కోసం ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. దాని ఫలితంగా ప్రపంచస్థాయిలో భారత్‌కు మంచి గౌరవం లభిస్తోంది’’ అని అజిత్‌ పవార్‌ అన్నారు.

అందుకే.. భాజపా ప్రభుత్వంలో చేరా..

ఎన్సీపీని చీల్చి భాజపా ప్రభుత్వంలో చేరడంపై ఈ సందర్భంగా ఆయన వివరణ ఇచ్చారు. ‘‘నాకు రాష్ట్ర అభివృద్ధి కావాలి. ప్రతిపక్షంలో ఉంటే నిరసనలు, ధర్నాలు చేయవచ్చు. కానీ, ఏ అభివృద్ది జరగాలన్నా నిర్ణయం అధికారంలో ఉన్నవారిదే. అందుకే.. భాజపా (శివసేన) ప్రభుత్వంలో చేరా’’అని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని