Lok Sabha: పార్లమెంట్‌ ఆవరణలో ఆసక్తికర సన్నివేశం.. కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలిపిన కాంగ్రెస్ ఎంపీ

ప్రతిపక్షాల నిరసనల మధ్య పార్లమెంట్‌ ఆవరణలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కేంద్ర మంత్రికి కాంగ్రెస్‌ ఎంపీ ధన్యవాదాలు చెప్పారు.

Updated : 19 Dec 2023 16:07 IST

దిల్లీ: లోక్‌సభలో దుండగుల చొరబాటు ఘటన పార్లమెంట్‌ సమావేశాలకు మరోసారి అంతరాయం కలిగించింది. దీనిపై కేంద్ర హోం మంత్రి ప్రకటన చేయాలని ప్రతిపక్ష ఎంపీలు పట్టుపట్టారు. ఈ క్రమంలో సభాపతి ఆదేశాలు ధిక్కరించినందుకు మరో 49 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయాలని కోరుతూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మూజువాణీ ఓటుతో లోక్‌సభ ఆమోదించింది. ఈ క్రమంలో పార్లమెంట్‌ ఆవరణలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ (Shashi Tharoor) కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari)కి ధన్యవాదాలు చెప్పారు. కేరళలోని జాతీయ రహదారి-66 నిర్మాణం పూర్తి చేసినందుకు గడ్కరీకి థరూర్‌ ధన్యవాదాలు చెబుతూ ఆయనతో ఉన్న ఫొటోను ఎక్స్‌లో షేర్‌ చేశారు. 

లోక్‌సభలో మరో 49 మందిపై సస్పెన్షన్‌ వేటు..

‘‘లోక్‌సభ సమావేశాల సందర్భంగా ఈ అవకాశం నాకు లభించింది. కాళకుటం నుంచి కరోడ్‌ వరకు ఎన్‌హెచ్‌-66 నిర్మాణం పూర్తి చేసినందుకు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి ధన్యవాదాలు. భవిష్యత్తులో తిరువనంతపురం నుంచి కన్యాకుమారి వరకు నాలుగు లైన్ల రహదారికి ఇది అనుసంధానం అవుతుంది. ఈ రహదారి అభివృద్ధి పనులను నేనే ప్రారంభించాను. నియోజవర్గ ప్రజల అభ్యర్థన మేరకు ఓవర్‌పాస్‌లు, ట్రాఫిక్‌ లైట్లు, మెరుగైన అనుసంధానం కోసం కేంద్ర మంత్రిని కలవడం జరిగింది. ఆయన సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ధన్యవాదాలు నితిన్‌ గడ్కరీజీ’’ అని థరూర్‌ ట్వీట్ చేశారు. పార్లమెంట్‌లో మంగళవారం సస్పెన్షన్‌కు గురైన 49 మంది ఎంపీల్లో శశి థరూర్‌ కూడా ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని