Sengol: హాట్‌టాపిక్‌గా మారిన రాజదండం.. కాంగ్రెస్‌పై మండిపడ్డ అమిత్‌షా

New Parliament building Opening: పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవం, అందులో ఆవిష్కరించే రాజదండం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారాయి. ఈ అంశాలపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రగడ కొనసాగుతోంది.

Updated : 26 May 2023 16:23 IST

దిల్లీ: పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవం వేళ.. ‘రాజదండం’(Sengol) చర్చనీయాంశమైంది. అది కూడా అధికార, ప్రతిపక్షాల మధ్య వివాదానికి దారితీసింది. బ్రిటిషర్ల నుంచి భారత్‌కు బదిలీ అయిన అధికారాలకు ఈ రాజదండం ప్రతీక అని కేంద్రం చెప్తుండగా.. అందుకు లిఖితపూర్వకమైన ఆధారాలు లేవని కాంగ్రెస్ వాదిస్తోంది. తాజాగా దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా(Amit Shah) ట్విటర్‌ వేదికగా కాంగ్రెస్‌పై మండిపడ్డారు.(New Parliament building Opening) 

ఇదీ చదవండి: కొత్త లోక్‌సభలో రాజదండం

‘భారత సంప్రదాయాలు, సంస్కృతులను కాంగ్రెస్‌ పార్టీ ఎందుకంతలా ద్వేషిస్తుంది? తమిళనాడుకు చెందిన మఠంలోని స్వామీజీల నుంచి జవహర్‌లాల్‌ నెహ్రూ ఈ పవిత్ర సెంగోల్‌(రాజదండం)ను స్వీకరించారు. దానినొక వాకింగ్‌ స్టిక్‌ వలే మ్యూజియంలో పెట్టేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ మరోసారి అవమానకరంగా వ్యవహరిస్తోంది. భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన సమయంలో ఆ మఠం సెంగోల్‌(Sengol) ప్రాముఖ్యతను వెల్లడించింది. కాంగ్రెస్ మాత్రం అదంతా బోగస్‌ అంటోంది. తన ప్రవర్తన గురించి ఆ పార్టీ ఆలోచించుకోవాలి’అని అమిత్‌ షా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మే 28న పార్లమెంట్ నూతన భవనం ప్రారంభం కానుంది. ఆ రోజు స్పీకర్ కుర్చీ పక్కన రాజదండాన్ని అమర్చనున్నట్లు గతంలో అమిత్‌ షా వెల్లడించారు. దీనిపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్‌ స్పందించారు. ప్రధాని మోదీ, ఆయన భజన బృందం.. తమిళనాడులో రాజకీయ ప్రయోజనాల కోసం ఈ రాజదండాన్ని ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. వారి లక్ష్యాలకు అనుగుణంగా వాస్తవాలను వక్రీకరిస్తారని దుయ్యబట్టారు. ‘ఈ రాజదండాన్ని అధికార బదిలీకి ప్రతీకగా మౌంట్‌బాటెన్‌, నెహ్రూ, రాజాజీ వర్ణించినట్లుగా లిఖితపూర్వక ఆధారాలు ఏవీ లేవు. ఇదంతా బోగస్‌. దీనిపై రాజాజీ అనుచరులు కొందరు తీవ్ర ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు’అని జైరాం రమేశ్ వ్యాఖ్యలు చేశారు.

ఈ కథనం చదవి, జ్ఞానం తెచ్చుకోండి: హర్‌దీప్‌ సింగ్ పురి

కొత్త పార్లమెంట్ భవనం, రాజదండం వివాదంపై కేంద్రమంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరి స్పందించారు.  ‘1947లో అమెరికా టైమ్‌ మేగజీన్‌లో ఒక కథనాన్ని ప్రచురించారు. పార్లమెంట్ కొత్త భవనం విషయంలో నిరసన చేస్తున్నవారంతా ఆ కథనాన్ని చదవాలి. సెంగోల్‌ ప్రాముఖ్యత ఏంటి..?, 1947లో ఏం జరిగింది..? అనే విషయాలపై జ్ఞానం పొందాలి’అంటూ అప్పటి టైమ్‌ కథనాన్ని షేర్ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని