కొత్త లోక్‌సభలో రాజదండం

త్వరలో ప్రారంభమవుతున్న పార్లమెంటు నూతన భవనం చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఆంగ్లేయుల నుంచి భారతీయులకు జరిగిన అధికార మార్పిడికి గుర్తుగా లార్డ్‌ మౌంట్‌బాటన్‌ నుంచి జవహర్‌లాల్‌ నెహ్రూ అందుకున్న రాజదండం (సెంగోల్‌)ను లోక్‌సభలో ప్రతిష్ఠించనున్నారు.

Updated : 25 May 2023 09:23 IST

28న ప్రతిష్ఠించనున్న ప్రధానమంత్రి మోదీ
తమిళనాడు వేదపండితుల నిర్వహణలో క్రతువు
కేంద్రమంత్రి హోంమంత్రి అమిత్‌షా వెల్లడి
ఈ తంతుకు రాజకీయాలు ముడిపెట్టొద్దని ప్రతిపక్షాలకు పిలుపు

ఈనాడు, దిల్లీ: త్వరలో ప్రారంభమవుతున్న పార్లమెంటు నూతన భవనం చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. ఆంగ్లేయుల నుంచి భారతీయులకు జరిగిన అధికార మార్పిడికి గుర్తుగా లార్డ్‌ మౌంట్‌బాటన్‌ నుంచి జవహర్‌లాల్‌ నెహ్రూ అందుకున్న రాజదండం (సెంగోల్‌)ను లోక్‌సభలో ప్రతిష్ఠించనున్నారు. ఇది అయిదు అడుగులకు పైగా పొడవు(162 సెం.మీ)తో, పైభాగంలో నంది చిహ్నంతో, బంగారుపూత కలిగిన వెండి దండం. పార్లమెంటు నూతన భవన ప్రారంభంతో పాటు రాజదండం ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 28న నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వెల్లడించారు. పరిపాలనలో నీతి, న్యాయం, కర్తవ్యపథంలో సాగాలన్న సందేశాన్ని ప్రజలు, ప్రజాప్రతినిధులకు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే దీనిని లోక్‌సభలో ప్రతిష్టిస్తున్నట్లు చెప్పారు. దీన్ని రాజకీయాలతో ముడిపెట్టొద్దని ఆయన ప్రతిపక్షాలకు సూచించారు. ఈ కార్యక్రమాన్ని పురాతన సంప్రదాయాలతో నవభారతాన్ని జోడించడానికి చేస్తున్న ప్రక్రియగా చూడాలని పిలుపునిచ్చారు. ఆయన బుధవారం దిల్లీలో తన సహచర కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డి, అనురాగ్‌సింగ్‌ ఠాకుర్‌లతో కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుతం దిల్లీలోని జాతీయ మ్యూజియంలో ఉన్న సెంగోల్‌ను తమిళనాడులోని తిరువడుత్తురై ఆధీనం నుంచి వచ్చే వేదపండితుల ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా ప్రతిష్ఠించనున్నట్లు ప్రకటించారు.

అంతకు ముందు వరకూ ఈ రాజదండం గుజరాత్‌లోని అలహాబాద్‌ మ్యూజియంలో ఉండేది. గతేడాది నవంబరు 4న అక్కడ నుంచి శాశ్వత ప్రాతిపదికన దిల్లీ జాతీయ మ్యూజియానికి తీసుకొచ్చారు. ‘‘ప్రధానమంత్రి ఈ నెల 28న నూతన పార్లమెంటు భవనాన్ని జాతికి అంకితం చేస్తున్నారు. ఈ కొత్త భవనం ప్రధానమంత్రి దార్శనికతకు సాక్ష్యం. నవ భారత నిర్మాణంలో మన సంస్కృతి, వారసత్వాన్ని జోడించేందుకు చేసిన సరికొత్త ప్రయత్నం. ఈ భవనాన్ని రికార్డు సమయంలో పూర్తిచేయడానికి దాదాపు 60వేల మంది కార్మికులు శ్రమించారు. భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ఈ శ్రామికులందర్నీ సన్మానించనున్నారు. దాంతోపాటు రాజదండ ప్రతిష్ఠాపన అనే మహత్తర ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఆ దండాన్నే తమిళంలో సెంగోల్‌ అంటారు. దాని అర్థం సంపద నుంచి సంపన్నం అని. దీని మూలాలు దేశ వారసత్వపరంపరతో ముడిపడి ఉన్నాయి.

కార్యక్రమంలో పాల్గొంటున్న 96 ఏళ్ల బంగారు చెట్టి

ఈ ఘటన 1947 ఆగస్టు 14 రాత్రితో ముడిపడి ఉంది. ప్రస్తుతం దీని గురించి దేశంలో ఎక్కువ మందికి తెలియదు. ఆంగ్లేయుల నుంచి భారతీయులకు జరిగిన అధికార మార్పిడికి ఇది ప్రతీక.  పవ్రితమైన సెంగోల్‌ను సంగ్రహాలయాల్లో ఉంచడం అనుచితమని భావించి దాన్ని కొత్త పార్లమెంటు భవనంలోని లోక్‌సభ స్పీకర్‌ ఆసనానికి పక్కన ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ఏర్పాటుకు ఇంతకంటే పవిత్రమైన స్థలం ఉండదన్నది మా ఉద్దేశం. రాజదండం ప్రతిష్ఠ భారతీయ సంస్కృతితో ముడిపడిన మహత్తర క్షణంగా చరిత్రలో మిగిలిపోతుంది. మరోసారి 1947 నాటి భారతీయుల భావనలను గుర్తుచేస్తుంది. అమృతకాల ప్రతిబింబంగా మారుతుంది. 1947 ఆగస్టు 14న నెహ్రూకు దీన్ని అందించే కార్యక్రమంలో పాల్గొన్న 96 ఏళ్ల ఉమ్మిడి బంగారు చెట్టి కూడా ఇందులో పాల్గొంటారు’’ అని అమిత్‌షా పేర్కొన్నారు.


రాజదండం విశేషాలు.. దాని చరిత్ర

* భారత్‌కు స్వాతంత్య్రం ఇచ్చే సమయంలో అధికార మార్పిడి క్రతువును పూర్తిచేయడానికి ఎలాంటి సాంస్కృతిక విధానాన్ని అనుసరించాలంటూ బ్రిటిష్‌ వైస్రాయ్‌ మౌంట్‌ బాటన్‌ తొలుత నెహ్రూను అడిగారు.

* ఈ క్రమంలో రాజగోపాలాచారి(రాజాజీ)కి క్రతువు నిర్వహణ విధాన ఎంపిక బాధ్యతలు అప్పగించారు.

* పలు అధ్యయనాలు చేసిన తర్వాత అధికార మార్పిడి కోసం రాజదండం (సెంగోల్‌) తయారీకి తమిళనాడులోని తిరువడుత్తురై ఆధీనాన్ని సంప్రదించారు.

* రాజదండం తయారీలో సహకరించేందుకు అంగీకరించిన మఠాధిపతులు.. మద్రాస్‌లోని స్వర్ణకారుడి చేత దానిని సిద్ధం చేయించారు. వెండితో చేసి బంగారు పూత పూసిన దాని పొడవు ఐదు అడుగులు ఉండగా..పై భాగంలో న్యాయానికి ప్రతీకగా నంది చిహ్నాన్ని అమర్చారు.

* తిరువడుత్తురై మఠానికి చెందిన స్వామీజీ ఒకరు ఆ దండాన్ని 1947, ఆగస్టు 14 రాత్రి మొదట మౌంట్‌బాటన్‌కు అందించి, దానిని తిరిగి వెనక్కి తీసుకున్నారట. ఆ తర్వాత గంగాజలంతో శుద్ధిచేసి, నెహ్రూ వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారట. అర్ధరాత్రి దేశానికి స్వాతంత్య్ర ప్రకటన చేయడానికి 15 నిమిషాల ముందు దానిని భారత నూతన ప్రధాని నెహ్రూకి అందజేశారట. ఆ ప్రక్రియ జరుగుతున్నంతసేపు ప్రత్యేకంగా రూపొందించిన ఒక పాటను ఆలపించారట.

* సెంగోల్‌ శబ్దం తమిళంలోని సెమ్మై నుంచి వచ్చింది.

* 8వ శతాబ్దంలో చోళుల కాలంనాటి నుంచి రాజదండం చేతుల మారడం ద్వారా అధికార మార్పిడి జరుగుతూ వచ్చింది. సెంగోల్‌ ఎవరు అందుకుంటారో వారి నుంచి న్యాయ, నిష్పాక్షికమైన పాలనను ప్రజలు ఆశిస్తారు.

* స్వాతంత్య్ర ప్రకటన సమయంలో సెంగోల్‌ స్వీకరణ ఘట్టాన్ని ప్రపంచవ్యాప్తంగా మీడియా ప్రచురించింది. ప్రఖ్యాత టైం మేగజీన్‌తోపాటు, పలు పత్రికలు గ్రాఫిక్స్‌తో దీనిపై కథనాలు ప్రచురించాయి. దేశీయ పత్రికలు కూడా దీనికి అదే గౌరవాన్ని ఇచ్చాయి.

* 1947 ఆగస్టు తర్వాత సెంగోల్‌ అందరి కళ్ల నుంచి మాయమైంది.

* స్వాతంత్య్రానంతరం 31 ఏళ్ల తర్వాత 1978 ఆగస్టు 15న కంచి మఠాధిపతి చంద్రశేఖర్‌ సరస్వతి స్వామి తన అనుచరుడు డాక్టర్‌ బీఆర్‌ సుబ్రహ్మణ్యంకు సెంగోల్‌ గురించి చెప్పారు. ఆ విషయాన్ని సుబ్రహ్మణ్యం తన పుస్తకంలో ప్రధానంగా ప్రస్తావించారు. తమిళ మీడియా కూడా దాని గురించి ప్రముఖంగా ప్రచురించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని