పోటీ పరీక్షల్లో అవకతవకలకు పాల్పడితే.. రూ.కోటి జరిమానా: లోక్‌సభలో బిల్లు

పరీక్షల్లో అవకతవకల(exam malpractices)కు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్రం లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టింది. 

Updated : 05 Feb 2024 15:11 IST

దిల్లీ: పోటీ పరీక్షల్లో అవకతవకల(exam malpractices)కు పాల్పడేవారిపై కేంద్రం కొరడా ఝుళిపించనుంది. అక్రమార్కులను అడ్డుకునేందుకు వీలుగా పబ్లిక్ ఎగ్జామినేషన్స్(ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) బిల్లును సోమవారం లోక్‌సభ(Lok Sabha)లో ప్రవేశపెట్టింది. దీనికింద నేరం నిరూపణ అయితే, గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష, రూ. కోటి వరకు జరిమానా విధించనుంది. కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ ఈ బిల్లును ప్రవేశపెట్టారు.

ఈ బిల్లు వ్యవస్థీకృత ముఠాలు, మాఫియాపై ఉక్కుపాదం మోపనుంది. వారితో చేతులు కలిపిన ప్రభుత్వ అధికారులను కూడా శిక్షించనున్నారు. రాజస్థాన్‌, హరియాణా, గుజరాత్‌, బిహార్‌ వంటి రాష్ట్రాల్లో ప్రశ్నాపత్రాల లీకేజీల కారణంగా పలు పోటీ పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో  కేంద్రం ఈ చట్టాన్ని తీసుకువచ్చింది. కంప్యూటరైజ్డ్‌ పరీక్షల ప్రక్రియను మరింత సురక్షితంగా మార్చే దిశగా సిఫార్సుల నిమిత్తం ఉన్నతస్థాయి జాతీయ సాంకేతిక కమిటీని ఇందులో ప్రతిపాదించారు.  పబ్లిక్ ఎగ్జామినేషన్ సిస్టమ్‌లో పారదర్శకత, విశ్వసనీయతను తీసుకువచ్చే లక్ష్యంతో కేంద్రం ఈ బిల్లును తీసుకువచ్చింది. అలాగే నిజాయతీతో చేసే ప్రయత్నాలకు తగిన ప్రతిఫలం లభిస్తుందని, తమ భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందని యువతకు భరోసా ఇవ్వడమే దీని ఉద్దేశం. ఈ బిల్లు లక్ష్యం విద్యార్థులు కాదని స్పష్టం చేసింది.

జనవరి 31న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేసిన ప్రసంగంలో ఈ బిల్లు గురించి ప్రస్తావించారు. పరీక్షల్లో అవకతవకల విషయంలో యువత ఆందోళన ప్రభుత్వానికి తెలుసని, ఈ సమస్యపై కఠినంగా వ్యవహరించేందుకు ఒక కొత్త చట్టాన్ని రూపొందించాలని నిర్ణయించిందని వెల్లడించారు. 

Lok Sabha,Telugu News,National News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని