PM Modi: బ్రిక్స్‌లో బలమైన సహకారంపై చర్చిస్తాం: మోదీ

బ్రిక్స్‌ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికాకు బయల్దేరి వెళ్లారు.

Updated : 22 Aug 2023 10:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బ్రిక్స్‌(BRICS) సభ్య దేశాలు భవిష్యత్తులో సహకారాన్ని బలోపేతం చేసుకోవడానికి, వ్యవస్థీకృత అభివృద్ధిని సమీక్షించుకోవడానికి జొహాన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న సమావేశం కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అభిప్రాయపడ్డారు. ఆయన మంగళవారం ఉదయం దిల్లీ నుంచి దక్షిణాఫ్రికాకు పయనమయ్యారు. ఈ సారి బ్రిక్స్‌ సమావేశం వివిధ రంగాల్లో సభ్య దేశాల మధ్య బలమైన సహకారానికి సంబంధించిన అజెండాను పరిశీలిస్తుందని వెల్లడించారు. ‘‘పేద దేశాలకు సంబంధించిన సమస్యలు, అభివృద్ధికి సంబంధించిన అంశాలు, బహుళపక్ష వ్యవస్థల సంస్కరణలను చర్చంచడానికి బ్రిక్స్‌ విలువైన వేదికగా మారిందని భావిస్తున్నాను’’ అని ప్రధాని మోదీ తన ప్రకటనలో పేర్కొన్నారు.

అనంతరం ప్రధాని ఎక్స్‌ (ట్విటర్)లో ఓ పోస్టు చేశారు. ‘‘జొహాన్నెస్‌బర్గ్‌లో జరగనున్న బ్రిక్స్‌ సమావేశంలో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాకు వెళుతున్నాను. బ్రిక్స్‌-ఆఫ్రికా, బ్రిక్స్‌ప్లస్‌ సమావేశాలు కూడా జరగనున్నాయి. పేద దేశాల సమస్యలు, ఇతర అభివృద్ధి అంశాలపై చర్చించేందుకు ఇది వేదికగా మారింది’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. 

జిన్‌పింగ్‌, మోదీ భేటీ ఉంటుందా?.. అందరి చూపూ ఈ ఇద్దరిపైనే!

ప్రధాని మోదీ ఆగస్టు 22- 24 వరకు 15వ బ్రిక్స్‌ సమావేశాల్లో పాల్గొంటారు. అనంతరం గ్రీస్‌ పర్యటనకు వెళ్లనున్నారు. 2019 తర్వాత బ్రిక్స్‌ దేశాధినేతలు వ్యక్తిగతంగా హాజరవుతున్న తొలి సమవేశం కావడంతో దీనికి ప్రాధాన్యత పెరిగింది. ఈ సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ గైర్హాజరవుతున్నారు. పుతిన్‌ బదులు ఆ దేశ విదేశాంగమంత్రి సెర్గీ లవ్రోవ్‌ సదస్సులో పాల్గొంటారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ మధ్య సమావేశం జరగనుందా.. లేదా..?  అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని