BRICS: జిన్‌పింగ్‌, మోదీ భేటీ ఉంటుందా?.. అందరి చూపూ ఈ ఇద్దరిపైనే!

దక్షిణాఫ్రికాలోని జొహాన్నెస్‌బర్గ్‌లో మంగళవారం నుంచి ప్రారంభం కానున్న బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ మధ్య సమావేశం జరగనుందా.. లేదా..?  అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది.

Updated : 22 Aug 2023 08:34 IST

నేటి నుంచి బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు

దిల్లీ: దక్షిణాఫ్రికాలోని జొహాన్నెస్‌బర్గ్‌లో మంగళవారం నుంచి ప్రారంభం కానున్న బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ మధ్య సమావేశం జరగనుందా.. లేదా..?  అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది. సోమవారం విలేకరుల సమావేశంలో భారత విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి వినయ్‌ ఖ్వాత్రా కూడా దీనిపై నేరుగా సమాధానమివ్వలేదు. ఇంకా ప్రధాని ద్వైపాక్షిక సమావేశాలు ఖరారు కావాల్సి ఉందని మాత్రమే తెలిపారు. వాస్తవాధీన రేఖ వెంబడి 2020లో ఇరు దేశాల సైన్యాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణాత్మక పరిణామాల తర్వాత మోదీ, షీ జిన్‌పింగ్‌ భేటీ జరగలేదు. గతేడాది జీ20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఇండోనేసియాలోని బాలిలో విందు సందర్భంగా మాట్లాడుకున్నా.. అది కొంతసేపే. ఈ నేపథ్యంలో బ్రిక్స్‌ సదస్సులో ఈ ఇరువురు నేతల కలయికపై ఊహాగానాలు వెలువడుతున్నాయి. మంగళవారం దక్షిణాఫ్రికాకు మోదీ పయనం కానున్నారు. షీ జిన్‌పింగ్‌ కూడా బ్రిక్స్‌ సదస్సుకు హాజరుకానున్నారు. బ్రిక్స్‌లో దక్షిణాఫ్రికా, భారత్‌, చైనా, రష్యా, బ్రెజిల్‌ సభ్యదేశాలు. ఒక్క రష్యా తప్ప మిగిలిన దేశాధినేతలంతా ఈ సదస్సులో పాల్గొననున్నారు. ఉక్రెయిన్‌ యుద్ధ నేరాలకు సంబంధించి అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు వ్యతిరేకంగా వారెంటు జారీ చేసింది. దీంతో పుతిన్‌ బదులు ఆ దేశ విదేశాంగమంత్రి సెర్గీ లవ్రోవ్‌ సదస్సులో పాల్గొంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని