Bullet Train: సముద్ర గర్భంలో సొరంగం.. బిడ్లకు ఆహ్వానం!

దేశంలోనే మొట్టమొదటి సారిగా నిర్మించనున్న సముద్ర గర్భ సొరంగం నిర్మాణానికి సంబంధించి మళ్లీ కదలిక వచ్చింది. ముంబయి-అహ్మదాబాద్‌ మధ్య నిర్మించనున్న హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ పనులకు నేషనల్‌ హైస్పీడ్‌ రైల్వే కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌) బిడ్లను ఆహ్వానించింది.

Published : 24 Sep 2022 02:23 IST

దిల్లీ: దేశంలోనే మొట్టమొదటి సారిగా నిర్మించనున్న సముద్ర గర్భ సొరంగం నిర్మాణానికి సంబంధించి మళ్లీ కదలిక వచ్చింది. ముంబయి-అహ్మదాబాద్‌ మధ్య నిర్మించనున్న హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ పనులకు నేషనల్‌ హైస్పీడ్‌ రైల్వే కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌) బిడ్లను ఆహ్వానించింది. హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌లో భాగంగా 21 కిలోమీటర్ల మేర సొరంగాన్ని తవ్వనున్నారు. ఇందులో 7 కిలోమీటర్లు సముద్రగర్భంలో తవ్వాల్సి ఉంది. మహారాష్ట్రలోని బంద్రా-కుర్లా కాంప్లెక్స్‌ మధ్య సాధారణ సొరంగాన్ని తవ్వాల్సి ఉండగా.. థానే జిల్లాలోని శిల్‌ఫాటా ప్రాంతంలో సముద్రంలో నిర్మించాల్సి ఉంది. న్యూ ఆస్ట్రియన్‌ టన్నెల్‌ విధానం (ఎన్‌ఏటీఎమ్‌)లో సొరంగాన్ని నిర్మించనున్నారు.

2019లో సొరంగం నిర్మాణానికి ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌  తొలిసారిగా టెండర్లు ఆహ్వానించింది. అయితే బిడ్డర్లెవరూ ఆసక్తి చూపలేదు. ఆ తర్వాత గత నవంబర్‌లోనూ ఈ సొరంగ మార్గాల ఏర్పాటుకు మరోసారి బిడ్లను ఆహ్వానించింది. కానీ, పరిపాలన పరమైన కారణాలతో కార్యరూపం దాల్చలేదు. తాజాగా మహారాష్ట్రలో ప్రభుత్వం మారిన తర్వాత ప్రాజెక్టు నిర్మాణ ప్రక్రియలో కదలిక వచ్చింది. మరోవైపు బంద్రా-కుర్ల కాంప్లెక్‌ మధ్య భూసేకరణ పెద్ద సమస్యగా మారడం వల్లే సొరంగ నిర్మాణంలో ఆలస్యం జరుగుతున్నట్లు సమాచారం.

ముంబయి నుంచి అహ్మదాబాద్‌ మధ్య చేపడుతోన్న ఈ రైలు కారిడార్‌ మొత్తం పొడవు 508.17 కిలోమీటర్లు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత అహ్మదాబాద్‌ నుంచి ముంబయి కేవలం 2.58 గంటల్లో చేరుకోవచ్చు. గుజరాత్‌లో మొత్తం 8 స్టేషన్లు ఉండగా.. మహారాష్ట్రలో నాలుగు స్టేషన్లు ఉన్నాయి. జపాన్‌ సహకారంతో భారత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపడుతోంది. అయితే, మహారాష్ట్రలో ఐదు గ్రామాల ప్రజలు ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు. ఏదేమైనా.. ప్రాజెక్టును పూర్తిచేసి 2026లో తొలిదశ ట్రయల్స్‌ను నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని