Mahua Moitra: మహువా మొయిత్రా నివాసంలో సీబీఐ సోదాలు

Mahua Moitra: డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడిగారన్న కేసుకు సంబంధించి టీఎంసీ మాజీ ఎంపీ మహువా మొయిత్రా నివాసంలో సీబీఐ అధికారులు సోదాలు చేపట్టారు. 

Updated : 23 Mar 2024 18:47 IST

కోల్‌కతా: పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారంటూ తృణమూల్‌ కాంగ్రెస్‌ (TMC) మాజీ ఎంపీ మహువా మొయిత్రా (Mahua Moitra)పై వచ్చిన ఆరోపణలపై సీబీఐ (CBI) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే దర్యాప్తు అధికారులు శనివారం సోదాలు చేపట్టారు. పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలోని మహువా నివాసంతో పాటు ఇతర నగరాల్లో ఆమెకు చెందిన కార్యాలయాల్లో తనిఖీలు జరుగుతున్నాయి.

ఈ కేసులో భాజపా ఎంపీ నిషికాంత్‌ దుబే ఫిర్యాదు మేరకు మహువాపై దర్యాప్తు చేపట్టాలని సీబీఐని లోక్‌పాల్‌ ఆదేశించింది. ఆరు వారాల్లోగా నివేదిక సమర్పించాలని సూచించింది. దీంతో గురువారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ సోదాలు చేపట్టింది.

నాతో పోలీసు అధికారి దురుసుగా ప్రవర్తించారు: కేజ్రీవాల్‌

అదానీ గ్రూప్‌ను, ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకునేలా ప్రశ్నలు అడిగేందుకు ప్రముఖ వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందానీ నుంచి మహువా రూ.2 కోట్లతోపాటు ఖరీదైన బహుమతులు తీసుకున్నారని భాజపా ఎంపీ నిషికాంత్‌ దుబే ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన లోక్‌సభ నైతిక విలువల కమిటీ.. ఆమె అనైతిక ప్రవర్తనకు, సభా ధిక్కరణకు పాల్పడ్డారని తేల్చింది. ఈ నివేదిక ఆధారంగా గతేడాది డిసెంబరులో స్పీకర్‌ బహిష్కరణ వేటు వేయడంతో లోక్‌సభ సభ్యత్వం రద్దయ్యింది.

దీన్ని మహువా తీవ్రంగా ఖండించారు. బహిష్కరణ వేటుపై సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మరోవైపు, ఇదే వ్యవహారానికి సంబంధించిన విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA) నిబంధనల ఉల్లంఘన కేసులో ఈడీ ఆమెకు సమన్లు జారీ చేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని