CBSE: 10, 12వ తరగతి ఫలితాల్లో మార్కుల డివిజన్‌ ప్రకటించం: బోర్డు

10, 12వ తరగతి పరీక్షల ఫలితాల్లో మార్కులకు సంబంధించి ఎటువంటి డివిజన్లు/డిస్టింక్షన్‌ (Distinction) తాము కేటాయించమని సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (CBSE) స్పష్టం చేసింది.

Updated : 01 Dec 2023 15:51 IST

దిల్లీ: 10, 12 తరగతుల పరీక్ష ఫలితాలకు సంబంధించి సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (CBSE) కీలక ప్రకటన వెలువరించింది. 10, 12వ తరగతి పరీక్షల ఫలితాల్లో భాగంగా ఎటువంటి డివిజన్లు/డిస్టింక్షన్‌ (Distinction) ప్రకటించబోమని తేల్చిచెప్పింది. మార్కుల శాతాన్ని కూడా పేర్కొనమని స్పష్టంచేసింది. ఒకవేళ ఐదు కంటే ఎక్కువ సబ్జెక్టులను ఎంచుకున్న విద్యార్థుల విషయంలో కూడా.. వారు తర్వాత చేరాలనుకున్న ఉన్నత విద్యాసంస్థలు/కంపెనీలే వాటిలో ఉత్తమ పరిగణనలోకి తీసుకొని నిర్ణయం వెలువరిస్తాయని పేర్కొంది. ప్రస్తుతం సీబీఎస్‌ఈ మార్కులు, పొజిషనల్‌ గ్రేడ్‌లు ఇస్తున్న విషయం తెలిసిందే. బోర్డు పరీక్షల్లో మార్కుల శాతాన్ని గణించే విధానం గురించి తెలియజేయాలంటూ కొందరు విద్యార్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులపై సీబీఎస్‌ఈ పైవిధంగా స్పందించింది. 

‘ఫలితాల్లో భాగంగా ఎటువంటి డివిజన్‌, డిస్టింక్షన్‌ లేదా మార్కుల శాతాన్ని ప్రకటించం. ఒకవేళ విద్యార్థి ఐదు కంటే ఎక్కువ సబ్జెక్టులను ఎంచుకున్నట్లయితే.. వాటిలో ఐదు ఉత్తమ సబ్జెక్టులను గుర్తించడంపై సదరు ఇన్‌స్టిట్యూట్‌ లేదా నియామక సంస్థ నిర్ణయం తీసుకోవచ్చు’ అని సీబీఎస్‌ఈ ఎగ్జామినేషన్‌ కంట్రోలర్‌ సన్యమ్‌ భరద్వాజ్‌ పేర్కొన్నారు.

ఏడాదిలో రెండుసార్లు బోర్డు పరీక్షలు: కేంద్ర విద్యాశాఖ

మార్కుల శాతాన్ని లెక్కించడం, ప్రకటించడం లేదా వెల్లడించడం వంటివి బోర్డు చేయదని భరద్వాజ్‌ స్పష్టం చేశారు. ఉన్నత విద్య లేదా ఉద్యోగ సమయంలో ఒకవేళ మార్కుల శాతం అవసరమైతే సదరు ఇన్‌స్టిట్యూట్‌/నియామక సంస్థ వాటిని గణించుకోవచ్చన్నారు. ఇక మెరిట్‌లిస్ట్‌ను ప్రకటించే విధానానికి బోర్డు గతంలోనే స్వస్తి చెప్పిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని