Agni-5: భారత్‌ ‘అగ్ని’ పరీక్ష వేళ.. బంగాళాఖాతంలోనే డ్రాగన్‌ నిఘా నౌక..!

మన అగ్ని క్షిపణి చైనాకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. భారత్‌ దీనిని పరీక్షిస్తోందనగానే.. డ్రాగన్‌ నిఘా నౌకలు హిందూ మహాసముద్రంలోకి వచ్చేస్తాయి. తాజాగా ఇదే జరిగింది.. 

Updated : 12 Mar 2024 15:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: శత్రురాడార్లు.. గగనతల రక్షణ వ్యవస్థలకు దుర్భేద్యమైన  ‘మిషన్‌ దివ్యాస్త్ర’  పరీక్షను చైనా (China)  అత్యంత జాగ్రత్తగా పరిశీలించింది. దీనిలో భారత్‌ ఒక క్షిపణితో బహుళ లక్ష్యాలను ఛేదించే ఎంఐఆర్‌వీ (మల్టిపుల్‌ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్‌ రీఎంట్రీ వెహికల్‌) టెక్నాలజీని తొలిసారి సోమవారం పరీక్షించిన విషయం తెలిసిందే. దీనికి కొన్ని వారాల ముందే బీజింగ్‌ నుంచి బంగాళాఖాతం దిశగా చైనా పరిశోధక నౌక బయల్దేరింది. ఇప్పటికే మరో నిఘా ఓడ భారత్‌కు పశ్చిమాన మాల్దీవుల్లో తిష్ఠ వేసిన విషయం తెలిసిందే.  

చైనా గూఢచర్యం ఇలా..

ఫిబ్రవరి 23వ తేదీన క్వాంగ్‌డావ్‌ నుంచి ‘షియాంగ్‌ యంగ్‌ హాంగ్‌ 01’ నౌక బయల్దేరింది. ఓపెన్ సోర్స్‌ ఇంటెలిజెన్స్‌ నిపుణుడు డామియన్‌ సైమన్‌ లెక్కల ప్రకారం 4,425 టన్నుల బరువున్న ఈ ఓడ ఆదివారం బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. ఈ విషయాన్ని తన సోషల్‌ మీడియా వేదిక ఎక్స్‌లో  వెల్లడించారు. ప్రస్తుతం అది భారత్‌ అణుశక్తి చోదిత సబ్‌మెరైన్‌ స్థావరమైన విశాఖ తీరం నుంచి 480 కిలోమీటర్ల దూరంలో ఉంది. 

నోటామ్‌ వేళకు సరిగ్గా..

సాధారణంగా క్షిపణి పరీక్షలకు ముందు హెచ్చరిక సూచీ అయిన ‘నోటిస్‌ టు ఎయిర్‌మిషన్‌’(నోటామ్‌)ను భారత్‌ మార్చి 7వ తేదీన జారీ చేసింది. దీంతో బంగాళాఖాతంలో 3,550 కిమీ రేంజిలో నౌకలు, విమానాల కార్యకలాపాలను నియంత్రించినట్లైంది. ఈ తేదీల్లోనే డ్రాగన్‌కు చెందిన ‘షియాంగ్‌ యంగ్‌ హాంగ్‌ 01’  బంగాళాఖాతంలోకి వచ్చింది. దీనిలో అగ్ని-5 పరీక్షను పూర్తిగా గమనించి రేంజి, సామర్థ్యాన్ని అంచనావేసుకొనే టెక్నాలజీ ఉందనే అంచనాలున్నాయి. కానీ, చైనా మాత్రం ఇది కేవలం పరిశోధక నౌకే అని బుకాయిస్తోంది. భారత్‌ సహా పశ్చిమ దేశాలు మాత్రం ఈ ఓడలు ప్రత్యర్థి నౌకాదళ, సబ్‌మెరైన్‌ కదలికలను గుర్తించగలవని చెబుతున్నాయి. 

‘దివ్యాస్త్రం.. దిగ్విజయం!

కొంత మంది చైనా నిపుణులు అగ్ని-5 రేంజి 5,000 కిలోమీటర్ల కంటే అధికమని బలంగా నమ్ముతున్నారు. 2012లో పీఎల్ఏ అకాడమీ ఆఫ్‌ మిలటరీ సైన్సెస్‌ నిపుణుడు డువెన్లాంగ్‌ ఈ క్షిపణి రేంజి దాదాపు 8,000 కిలో మీటర్ల వరకు ఉంటుందని ఓ పత్రికకు రాసిన వ్యాసంలో పేర్కొన్నాడు. 

2022లో కూడా సరిగ్గా ఇలానే..

భారత్‌ అగ్ని శ్రేణి క్షిపణి పరీక్ష తలపెట్టినప్పుడల్లా చైనా నౌకలు హిందూ మహాసముద్రంలోకి చొరబడటం ఇదే తొలిసారి కాదు. 2022 నవంబర్‌లో కూడా ఆ దేశానికి చెందిన యువాన్‌ వాంగ్‌  శ్రేణి నౌక హిందూ మహాసముద్రంలోకి వచ్చింది. వాస్తవానికి భారత్‌ అదే సమయంలో అబ్దుల్‌ కలాం ద్వీపం నుంచి అగ్ని-5 పరీక్షకు ప్రణాళిక సిద్ధం చేసింది. చైనా నిఘాను గమనించి నాడు నోటామ్‌ను రద్దు చేయాల్సి వచ్చింది. డిసెంబర్‌లో మరోసారి పరీక్షకు ఏర్పాట్లు చేయగా.. చైనా నౌక ఆ ప్రాంతంలో మళ్లీ ప్రత్యక్షమైంది.   

పరిశోధనల పేరిట చైనా పదేపదే హిందూ మహా సముద్రంలోకి తన ఓడలను పంపిస్తోంది. 2014లో చైనా అణు జలాంతర్గామిని లంక పోర్టుల్లో డాక్‌ చేసింది. ఆ సమయంలో భారత్‌, శ్రీలంక మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. 2022లో చైనా ఇలాంటి ప్రయత్నమే చేసింది. తన బాలిస్టిక్‌ క్షిపణి, శాటిలైట్‌ ట్రాకింగ్‌ ఓడ యువాన్‌ వాంగ్‌-5ను శ్రీలంకలోని హంబన్‌తోట పోర్టులో వారంపాటు నిలిపింది. 750 కిలోమీటర్ల పరిధి వరకు ఇది నిఘా పెట్టగలుగుతుందని అంచనా. శక్తిమంతమైన చైనా పరిశోధక నౌకలు తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రదేశాలపై కన్నేయగలవు. నాడు కూడా భారత్‌ అభ్యంతరం తెలిపింది.

2024 జనవరిలో అమెరికాకు చెందిన థింక్‌ట్యాంక్‌ సీఎస్‌ఎస్‌ నివేదిక ప్రకారం చైనా వద్ద 64 వరకు పరిశోధక, సర్వే నౌకలున్నాయి. వీటిల్లో 80శాతం కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయని ఆ సంస్థ వెల్లడించింది.  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు