Chinese spy balloon: చైనా నిఘా బెలూన్‌ ఘటన.. అమెరికా ఇంటర్నెట్‌నే వాడిన డ్రాగన్‌..!

ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా(USA) గగనతలంలో కదలాడిన చైనా బెలూన్‌(Chinese Spy Balloon).. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు కారణమైంది. దీనిపై తాజాగా కీలక విషయం వెలుగులోకి వచ్చింది. 

Updated : 30 Dec 2023 15:26 IST

వాషింగ్టన్: ఈ ఏడాది ఆరంభంలో అమెరికా గగనతలంలో చైనా గూఢచర్య బెలూన్‌ (Chinese Spy Balloon) తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇది రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచింది. అమెరికా గగనతలంలో కదలాడిన ఆ బెలూన్‌.. అగ్రరాజ్య ఇంటర్నెట్‌ను ఉపయోగించుకుందని సమాచారం. బెలూన్ నావిగేషన్‌, లొకేషన్‌కు సంబంధించిన డేటాను తిరిగి చైనాకు పంపేందుకు ఆ సదుపాయాన్ని ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది. యూఎస్‌ అధికారిని ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా సంస్థ సీఎన్‌ఎన్ ఈ మేరకు కథనాన్ని ప్రచురించింది. అయితే ఆ సర్వీస్‌ ప్రొవైడర్ గురించిన సమాచారం మాత్రం వెల్లడికాలేదు.

తమ దేశంపై నిఘా పెట్టేందుకే  డ్రాగన్‌ ఆ బెలూన్‌ను ప్రయోగించిందని ఇదివరకే అమెరికా తేల్చి చెప్పింది. అణు క్షిపణుల ప్రయోగ కేంద్రం ఉన్న మోంటానాలో ఈ బెలూన్‌ కన్పించడంతో అగ్రదేశం దీనిని తీవ్రంగా పరిగణించింది. ఆ తర్వాత ఆ  బెలూన్‌ (Chinese Spy Balloon)ను  కూల్చివేసి శకలాలను సేకరించింది. బెలూన్‌లో యూఎస్‌ గేర్‌తో పాటు ప్రత్యేకమైన చైనీస్‌ సెన్సర్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ సాంకేతికతతో అమెరికాలోని కీలక ప్రదేశాల ఫొటోలు, వీడియోలు, ఇతర సమాచారాన్ని సేకరించి బీజింగ్‌కు బదిలీ చేయాలని ప్రయత్నించిందని అమెరికా విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఇది వాతావరణ పరిశోధన కోసం ప్రయోగించిన బెలూన్‌ కాదని.. అమెరికాపై నిఘా పెట్టాలనే ఉద్దేశంతోనే దీన్ని పంపించారని దర్యాప్తులో తేలినట్లు అప్పట్లో అధికారులు అంచనా వేశారు.

‘విమానం గాల్లో ఉండగానే ఇంజిన్లకు శక్తిని ఆపేశారు’

ఈ బెలూన్‌ అలస్కా, కెనడాతో పాటు అమెరికాలోని కొన్ని రాష్ట్రాల గగనతలాల మీదుగా ఎనిమిది రోజుల పాటు ప్రయాణించింది. అయితే, ఈ సమయంలో ఎలాంటి డేటాను ఈ బెలూన్‌ చైనాకు బదిలీ చేసినట్లు ఆధారాలు లభించలేదని అధికారులు చెప్పారు. కాగా ప్రస్తుత వ్యవహారంపై అటు అమెరికాకు చెందిన ఎఫ్‌బీఐ, ఆఫీస్‌ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్‌, ఇటు చైనా వైపు నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.  అది వాతావరణ పరిశోధన కోసం ప్రయోగించిన ‘ఎయిర్‌షిప్‌’ అని చైనా మొదటి నుంచి ఒకటే మాట చెప్తోంది. గాలుల కారణంగా లక్షిత ప్రాంతాన్ని దాటి వచ్చిందని.. అమెరికా గగనతలంలోకి రావడంపై విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని