అమిత్‌షా, అధిర్‌ రంజన్‌చౌధరీ మధ్య ఆసక్తికర సంభాషణ

పార్లమెంట్‌లో కేంద్రమంత్రి అమిత్‌ షా(Amit Shah) చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆయన ఆ మాట ఎందుకు అన్నారంటే..? 

Published : 03 Aug 2023 17:47 IST

దిల్లీ: లోక్‌సభలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా(Union Home Minister Amit Shah), కాంగ్రెస్ ఎంపీ అధిర్‌ రంజన్ చౌధరీ( Adhir Ranjan Chowdhury) మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ(Jawaharlal Nehru) గురించి అమిత్‌ షా ప్రస్తావించిన మాటలే అందుకు దారితీసింది. ఇంతకీ ఏం జరిగిందంటే..? 

కేంద్రం పార్లమెంట్‌(Parliament)లో ప్రవేశపెట్టిన దిల్లీ అధికారుల నియంత్రణ బిల్లుపై జరిగిన చర్చలో భాగంగా జవహర్‌ లాల్ నెహ్రూ కూడా దిల్లీకి రాష్ట్ర హోదా వ్యతిరేకించారని అమిత్‌ షా అన్నారు. దానిపై అధిర్ రంజన్ చౌధరీ మాట్లాడుతూ.. ‘అమిత్‌ షాజీ ఈ రోజు సభలో నెహ్రూ, కాంగ్రెస్‌ పార్టీని పదేపదే పొగడటం బాగా అనిపించింది. నేను చూసేది నిజమేనా అనుకున్నా. ఇది పగలా..? రాత్రా..? అనే భావన కలిగింది. వెంటనే అమిత్‌ షా వద్దకు పరిగెత్తి నోరు తీపిచేయాలనిపించింది. ఆ నోటి నుంచి వచ్చిన పొగడ్తలు నన్ను ఆశ్చర్యపర్చాయి’ అని ఎంపీ మాట్లాడుతుండగా.. అమిత్‌ షా కలగజేసుకున్నారు. ‘నేను నెహ్రూను పొగడలేదు. ఆయన చెప్పిన మాటను ఇక్కడ ప్రస్తావించాను. వారు దీనిని పొగడ్త అనుకుంటే నాకేం అభ్యంతరం లేదు’ అని బదులిచ్చారు. 

నెహ్రూ, అంబేడ్కర్‌లూ.. దిల్లీకి ‘రాష్ట్ర హోదా’ వ్యతిరేకించారు!

మంత్రి మాటలకు ఎంపీ విమర్శనాత్మకంగా స్పందించారు. ‘మీకు అవసరమైన సమయంలో నెహ్రూ మద్దతు తీసుకోండి. మీరు ఎప్పుడు అలా చేస్తే.. మణిపుర్, హరియాణాలో చోటుచేసుకుంటున్న ఘటనలు కనిపించవు. అలాగే దిల్లీ మా గుండెల్లో ఉంది. మీరు దిల్లీలో కుంభకోణాలు జరుగుతున్నాయని భావిస్తే.. మీకు ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. మీరు ఆరోపిస్తున్న కుంభకోణాల కోసం ఈ బిల్లును తీసుకురావాల్సిన  అవసరం ఉందా..?’ అని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని