Criminal Law Bills: విపక్ష ఎంపీల సస్పెన్షన్‌ వేళ.. లోక్‌సభలో ‘క్రిమినల్‌ బిల్లుల’పై చర్చ

Criminal Law Bill: విపక్ష ఎంపీల సస్పెన్షన్‌ తర్వాత.. క్రిమినల్‌ బిల్లులపై లోక్‌సభలో చర్చ జరుగుతోంది. అనంతరం దీనిపై ఓటింగ్‌ నిర్వహించి బిల్లులను ఆమోదించనున్నారు.

Updated : 19 Dec 2023 17:42 IST

దిల్లీ: బ్రిటిష్‌ హయాం నుంచి అమల్లో ఉన్న భారత శిక్షాస్మృతి (ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్‌పీసీ), సాక్ష్యాధార చట్టాల స్థానంలో కొత్త చట్టాలను తీసుకొచ్చేందుకు రూపొందించిన మూడు నేర శిక్షాస్మృతి బిల్లుల (Criminal Law Bills)పై లోక్‌సభ (Lok sabha) చర్చ చేపట్టింది. లోక్‌సభలో 2/3 వంతుల మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు అనంతరం.. ఈ బిల్లులపై దిగువ సభలో చర్చ జరుగుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ మూడు చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌), భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్‌), భారతీయ సాక్ష్య (బీఎస్‌).. పేరుతో మూడు కొత్త బిల్లులను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టులో జరిగిన పార్లమెంట్‌ సమావేశాల్లో తొలిసారి ఈ బిల్లులను ప్రవేశపెట్టారు. అయితే, వీటిపై అభ్యంతరాలు వ్యక్తమవడంతో తాజా శీతాకాల సమావేశాల్లో వీటిని కేంద్రం వెనక్కు తీసుకుంది.

లోక్‌సభలో మరో 49 మందిపై సస్పెన్షన్‌ వేటు..

ఆ తర్వాత వీటిల్లో కొన్ని మార్పులు చేసి.. భారతీయ న్యాయ (సెకండ్‌) సంహిత, భారతీయ నాగరిక్‌ సురక్షా (సెకండ్‌) సంహిత, భారతీయ సాక్ష్య (సెకండ్‌) బిల్లు - 2023 పేరుతో మళ్లీ కొత్తగా బిల్లులను ప్రవేశపెట్టారు. వీటిపై మంగళవారం లోక్‌సభ చర్చ చేపట్టింది. శీతాకాల సమావేశాల్లోనే ఈ బిల్లులను ఆమోదించుకోవాలని కేంద్రం ఆశిస్తోంది.

అయితే, విపక్ష ఎంపీలపై సస్పెన్షన్‌ వేళ ఈ బిల్లులపై లోక్‌సభలో చర్చ జరుగుతుండటం గమనార్హం. పార్లమెంట్‌లో ఇటీవల చోటుచేసుకున్న భద్రతా వైఫల్యం ఘటనపై చర్చకు పట్టుబట్టి నిరసన వ్యక్తం చేసిన విపక్ష సభ్యులను సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే. లోక్‌సభలో 95, రాజ్యసభలో 46 మందిని సభల నుంచి సస్పెండ్‌ చేశారు. దీంతో ప్రస్తుతం లోక్‌సభలో ప్రతిపక్షాల సంఖ్య మూడోవంతుకు పడిపోయింది. ఈ మూకుమ్మడి సస్పెన్షన్‌పై విపక్షాలు భగ్గుమన్నాయి. కొన్ని కీలకమైన చట్టాలను ఏకపక్షంగా పార్లమెంట్‌లో ఆమోదించుకునేందుకే తమను సస్పెండ్ చేశారంటూ ప్రతిపక్ష ఎంపీలు కేంద్రంపై మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని