Rabri Devi: ఆర్జేడీ, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల ఫిరాయింపులతో నీతీశ్‌కే గండం!

ఆర్జేడీ, మిత్రపక్షం కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న పరిణామాలతో సీఎం నీతీశ్‌ కుమార్‌ (Nitish Kumar)కే నష్టం జరుగుతుందని బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవీ (Rabri Devi) అన్నారు.

Published : 01 Mar 2024 01:36 IST

పట్నా: ఆర్జేడీ, మిత్రపక్షం కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతుండటంపై బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవీ (Rabri Devi) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాలతో ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ (Nitish Kumar)కే నష్టమని.. త్వరలోనే ఏదో చెడు జరుగుతుందనే విషయం ఆయన గ్రహించాలని సూచించారు. బిహార్‌లో రాజకీయ పోరు భాజపా-ఆర్జేడీ మధ్య ఉంటుందనే నమ్మకంతోనే తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కాషాయ పార్టీ లక్ష్యంగా చేసుకుందన్నారు. నీతీశ్‌ కుమార్‌ను గద్దె దించడానికి జేడీయూలో చీలిక తెచ్చేందుకు భాజపా శ్రీకారం చుట్టిందంటూ ఆర్జేడీ ఎమ్మెల్యే ముఖేశ్‌ రోషన్‌ ఆరోపించిన మరుసటి రోజే రబ్రీ దేవీ ఈవిధంగా స్పందించారు.

‘బిహార్‌లో ప్రస్తుతం పోరు ఆర్జేడీ- భాజపా మధ్యే. మూడో శక్తికి అవకాశమే లేదు. ఈ విషయం భాజపాకు తెలుసు. అందుకే మా నేతలను దూరం చేయడానికి ప్రయత్నిస్తోంది. అయినప్పటికీ మాకెలాంటి భయం లేదు. ఆందోళన చెందాల్సింది నీతీశ్‌ కుమారే. త్వరలో ఏదో చెడు జరుగుతుందని ఆయన తెలుసుకోవాలి. అసెంబ్లీలో సొంత బలాన్ని పెంచుకునేందుకు భాజపా ప్రయత్నిస్తుందని ఊరికే చెప్పడం లేదు’ అని ఆర్జేడీ జాతీయ ఉపాధ్యక్షురాలు రబ్రీ దేవీ పేర్కొన్నారు. గత రెండు వారాల్లోనే నలుగురు ఆర్జేడీ, ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఎన్డీయేలో చేరిన విషయాన్ని గుర్తుచేసిన ఆమె.. ఇతర రాష్ట్రాల్లో భాజపా చేస్తున్న వ్యవహారాలను చూడాలన్నారు.

హిమాచల్‌లో ‘ఆపరేషన్‌ కమలం’కు ప్రియాంకా అడ్డుకట్ట!

పార్టీలు మారుతున్న వారిపై ఇప్పటికే స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని రబ్రీ దేవీ పేర్కొన్నారు. ఇలా ఫిరాయింపులకు పాల్పడుతున్న వారిని స్పీకర్‌ అనుమతిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. ఇదిలాఉంటే, 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్‌లో 79 మందితో ఆర్జేడీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. భాజపాకు 78 మంది ఎమ్మెల్యేల బలం ఉండగా, జేడీయూకు 45, కాంగ్రెస్‌కు 17 మంది ఎమ్మెల్యేలున్నారు. అయితే, ఇటీవల కొందరు ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఫిరాయించడంతో మహాకూటమి అధికారం కోల్పోయింది. భాజపాతో కలిసి జేడీయూ అధినేత నీతీశ్‌ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని