Parliament Security Breach: లోక్‌సభలో భద్రతా వైఫల్యం ఘటన.. ‘సీన్‌ రీక్రియేషన్‌’కు ప్లాన్‌..!

Parliament Security Breach: లోక్‌సభలో దుండగులు అలజడి సృష్టించిన ఘటనను దిల్లీ పోలీసులు సీన్‌ రీక్రియేట్‌ చేయనున్నట్లు సమాచారం. మరోవైపు నిందితుల నుంచి సమాచారం రాబట్టేందుకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

Published : 15 Dec 2023 10:24 IST

దిల్లీ: పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యం (Parliament Security Breach) ఘటనపై దిల్లీ స్పెషల్‌ సెల్‌ విభాగ పోలీసులు (Delhi Police) దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే నిందితులను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు డిసెంబరు 13 నాటి అలజడి ఘటనను రీక్రియేట్‌ చేయాలని పోలీసులు యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

నిందితులను పార్లమెంట్‌కు తీసుకెళ్లి శని లేదా ఆది వారాల్లో ఈ ‘సీన్‌ రీక్రియేషన్‌ (scene recreation)’ చేయనున్నట్లు తెలుస్తోంది. తనిఖీలను తప్పించుకుని నిందితులు రంగు పొగ గొట్టాలతో పార్లమెంట్‌ లోపలికి ఎలా వెళ్లగలిగారు? లోక్‌సభ (Lok Sabha)లో తమ ప్లాన్‌ను ఎలా అమలు చేశారు? వంటివి తెలుసుకునేందుకు ఈ రీక్రియేషన్‌ ఉపయోగపడుతుందని స్పెషల్‌ సెల్‌ విభాగ వర్గాలు పేర్కొన్నాయి. వాస్తవానికి ఘటన జరిగిన నాడే ఈ సీన్‌ రీక్రియేషన్‌ ప్రక్రియ చేపట్టాలని పోలీసులు భావించినా.. సభా కార్యకలాపాల వల్ల అది సాధ్యపడలేదు. దీంతో శని, ఆది వారాల్లో పార్లమెంట్‌ సమావేశాలు లేకపోవడంతో ఆ రోజుల్లో దీనిని చేపట్టాలని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం.

పార్లమెంటులో అలజడి ఘటన వెనుక పెద్ద వ్యక్తులు?

అంతేగాక, నిందితులను గురుగ్రామ్‌లోని వారి ఫ్లాట్‌కు తీసుకెళ్లనున్నారు. అక్కడే వారు ఈ ఘటనకు ప్లాన్‌ చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. మరోవైపు నిందితులు గత 15 రోజుల్లో ఎవరెవరికి ఫోన్‌ చేశారన్న జాబితాను కూడా పోలీసులు రూపొందించారు. వారందరికీ ఫోన్లు చేసి విచారించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు కుట్ర పన్నింది ఆరుగురేనా? లేకా వీరి వెనుక ఇంకెవరైనా పెద్ద వ్యక్తులున్నారా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

ఈ కేసులో తొలుత ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేయగా.. కుట్రకు ప్రధాన సూత్రధారి అయిన ఆరో నిందితుడు లలిత్‌ నిన్న రాత్రి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అతడిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు పార్లమెంట్‌లో అలజడి సృష్టించిన నలుగురు నిందితులకు ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు ఏడు రోజుల కస్టడీ విధించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని