Modi: ప్రధాని మోదీ నివాసంపై డ్రోన్‌ కలకలం..!

ప్రధాని మోదీ భద్రతలో మరోసారి వైఫల్యం చోటుచేసుకుంది. ఆయన నివాసం వద్ద ఓ డ్రోన్‌ ఎగరడం కలకలం రేపింది.

Updated : 03 Jul 2023 10:45 IST

దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) నివాసం వద్ద ఓ డ్రోన్‌ (Drone) కలకలం రేపింది. సోమవారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో ఓ అనుమానాస్పద డ్రోన్‌ ప్రధాని నివాసంపై సంచరించినట్లు ఎస్పీజీ (స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌) నుంచి సమాచారం అందిందని దిల్లీ పోలీసులు (Delhi Police) వెల్లడించారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.

దిల్లీలోని లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌లో ప్రధాని అధికారిక నివాసం (PM Residence) ఉంది. సాధారణంగా ప్రధాని నివాసం వద్ద నో-ఫ్లై జోన్‌ (No-Fly Zone) అమల్లో ఉంటుంది. అలాంటి ప్రాంతంలోకి డ్రోన్‌ రావడంతో భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. దీంతో దిల్లీ పోలీసులు, భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి డ్రోన్‌ను ట్రాక్‌ చేసేందుకు ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టారు. అయితే ఇప్పటివరకు అనుమానాస్పదంగా ఏదీ కన్పించలేదని తెలుస్తోంది. ‘‘ప్రధాని నివాసం పరిసర ప్రాంతాల్లో ముమ్మర గాలింపు చేపట్టారు. ఇప్పటివరకు ఎలాంటి డ్రోన్‌ తరహా వస్తువు కన్పించలేదు. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ (ATC) రూంను కూడా సంప్రదించాం. ప్రధాని నివాసం వద్ద ఎలాంటి ఎగిరే వస్తువును గుర్తించలేదని వారు చెప్పారు’’ అని దిల్లీ పోలీసులు ఓ ప్రకటనలో వెల్లడించారు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నివాసం వద్ద కూడా ఓ అనుమానాస్పద డ్రోన్ సంచరించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కేజ్రీవాల్‌ నివాసం కూడా నో-ఫ్లై జోన్‌లోనే ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని