S Jaishankar: ‘నెహ్రూ విధానాలు అలా ఉంటే..?’: చైనాతో సంబంధాలపై జైశంకర్‌

కొత్త ఏడాది విసిరే సవాళ్లని ఎదుర్కోవడానికి భారత్ సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి జై శంకర్(S Jaishankar) అన్నారు. తమ ప్రభుత్వ విధానాలు ఎప్పుడూ దేశానికే తొలి ప్రాధాన్యం ఇస్తాయన్నారు.

Updated : 04 Jan 2024 11:24 IST

దిల్లీ: కొత్త ఏడాదిలోనూ ప్రపంచంలో ఒడుదొడుకులు ఉంటాయని విదేశాంగ మంత్రి జై శంకర్(S Jaishankar) అన్నారు. వీటిని ఎదుర్కొనేలా భారత్‌ ఆర్థికంగా, రాజకీయంగా మెరుగైన స్థితిలో ఉందని ధీమా వ్యక్తం చేశారు. తాను రాసిన 'Why Bharat Matters' పుస్తకావిష్కరణలో ఈ వ్యాఖ్యలు చేశారు. మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ విదేశాంగ విధానంపై విమర్శనాత్మకంగా స్పందించారు.

‘2024లో ప్రపంచ పరిస్థితులు కల్లోలంగానే ఉండొచ్చు. గతేడాది అంశాలే కొత్త సంవత్సరంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఈ సవాళ్లను ఎదుర్కొనే విషయంలో మనం రాజకీయంగా, ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉన్నాం’ అని జై శంకర్ అభిప్రాయపడ్డారు.

అలాగే భారత్‌-చైనా సంబంధాల(India-China Ties) విషయంలో తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ విధానాలపై స్పందిస్తూ.. ‘మన దేశ ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం ఇచ్చి ఉంటే.. చైనాతో బంధంపై ఆశలు పెంచుకొనే వాళ్లం కాదు. ఇదంతా నేను ఊహించి చెప్పడం లేదు. ఈ మాటలను బలపర్చే ఆధారాలున్నాయి. ఈ విషయంలో సర్దార్‌ వల్లాభాయ్‌ పటేల్-నెహ్రూ మధ్య నడిచిన లేఖల్లోనే భిన్నాభిప్రాయాలున్నట్లు కనిపిస్తోంది’ అని అన్నారు.

‘జైశంకర్‌కు ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి ఫోన్‌’

భద్రతా మండలిలో చైనా(China)కు చోటు దక్కేలా నెహ్రూ అనుసరించిన విధానాన్ని ఎత్తి చూపారు. 1962లో చైనాతో యుద్ధం సమయంలో అమెరికా మద్దతు తీసుకోవడానికి ఆయన సంకోచించారని ఆరోపించారు. కానీ, దీనిపై సర్దార్‌ పటేల్ స్పందన మాత్రం భిన్నంగా ఉందన్నారు. ‘అమెరికా పట్ల ఎందుకంత అపనమ్మకంగా ఉండాలి. చైనా-అమెరికా బంధం కోణం నుంచి కాకుండా..మన ప్రయోజనాల దృష్టిలో చూడాలి’ అని పటేల్ అభిప్రాయంగా ఉండేదని తెలిపారు.

ఇది వరకు ఇంటర్వ్యూలో కూడా.. చైనా(China)తో వాస్తవికత ఆధారంగా వ్యవహరించాలని జై శంకర్ అన్నారు. పరస్పర గౌరవం, ప్రయోజనాలపై ఆధారపడి సంబంధాలు ఉండాలని స్పష్టంగా చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని