తిహాడ్ జైలులో లొంగిపోయిన కేజ్రీవాల్‌

Arvind Kejriwal: ఎన్నికల ప్రచారానికి సుప్రీం కోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ముగియడంతో దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ తిహాడ్‌ జైలులో లొంగిపోయారు.

Updated : 02 Jun 2024 20:37 IST

దిల్లీ: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ఆదివారం తిహాడ్‌ జైలులో లొంగిపోయారు. ఎన్నికల ప్రచారం నిమిత్తం సుప్రీం కోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో ఆయన కోర్టు ఆదేశాల ప్రకారం జైలుకు చేరుకున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తన ఇంటి నుంచి బయల్దేరిన ఆయన రాజ్‌ఘాట్‌లోని మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులర్పించారు. అక్కడ నుంచి హనుమాన్ ఆలయానికి వెళ్లి ఆశీర్వాదం తీసుకున్న తర్వాత పార్టీ ఆఫీస్‌కు చేరుకున్నారు. పార్టీ నాయకులతో మాట్లాడిన కేజ్రీవాల్‌ సుప్రీం కోర్టుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

‘‘మధ్యంతర బెయిల్‌పై బయటికి రావడంతో ఎన్నికల ప్రచారంలో నా ప్రయత్నాలు ఫలించాయి. 21 రోజుల్లో ఒక్క నిమిషం కూడా వృథా చేయలేదు. కూటమి తరఫున ప్రచారం చేశా. దేశ ప్రయోజనాలకే నా మొదటి ప్రాధాన్యత. ఆ తర్వాతే ఆమ్‌ ఆద్మీ పార్టీ’’ అని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. 

ఇవి ఎగ్జిట్ పోల్స్‌ కావు.. మోదీ పోల్స్‌: రాహుల్‌ గాంధీ

ప్రస్తుతం దేశంలో నియంతృత్వ పాలన కొనసాగుతోందని (మోదీ సర్కార్‌ను ఉద్దేశిస్తూ) కేజ్రీవాల్‌ ఆరోపించారు. ఇదిలా ఉండగా.. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన దిల్లీ ముఖ్యమంత్రి లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌పై మే 10న జైలు నుంచి విడుదలయ్యారు. కోర్టు ఆయనకు 21 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ జూన్ 2న తిరిగి లొంగిపోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే.

కేజ్రీవాల్‌ జ్యుడీషియల్‌ కస్టడీ 5వరకు పొడిగింపు

సీఎం కేజ్రీవాల్‌ జ్యుడీషియల్‌ కస్టడీని దిల్లీ కోర్టు జూన్‌ 5వరకు పొడిగించింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో  సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ గడువు ముగియడంతో కోర్టు ఆదేశాల మేరకు ఆయన ఆదివారం తిహాడ్‌ జైలులో సరెండర్‌ అయ్యారు. దీంతో అధికారులు ఆయన్ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టులో హాజరుపరిచారు. కేజ్రీవాల్‌కు 14 రోజులు జ్యుడీషియల్‌ కస్టడీ విధించాలని ఈడీ కోరగా.. ఈ నెల 5వరకు కస్టడీ పొడిగిస్తూ డ్యూటీ జడ్జి సంజీవ్‌ అగర్వాల్‌ ఉత్తర్వులు ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు