Siddaramaiah: హిందీ వివాదం వేళ.. సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు

Eenadu icon
By National News Team Published : 01 Nov 2025 13:07 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

 ఇంటర్నెట్‌డెస్క్‌: కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాకు, పలు దక్షిణాది రాష్ట్రాలకు మధ్య హిందీ భాష విషయంలో మాటల యుద్ధం (Hindi row) నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (CM Siddaramaiah) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లీష్‌, హిందీ భాషలు దక్షిణాది రాష్ట్రాల్లో పిల్లల నైపుణ్యాలను బలహీనపరుస్తున్నాయన్నారు. విద్యా సంస్థల్లో మాతృభాషను ప్రోత్సహించేలా కేంద్రం చట్టం తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం కర్ణాటకపై సవతి తల్లి వైఖరిని ప్రదర్శిస్తూ.. హిందీని తమపై బలవంతంగా రుద్దుతోందన్నారు. కర్ణాటక రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యలు చేశారు. 

అభివృద్ధి చెందిన దేశాల పిల్లలు తమ మాతృభాషలోనే నేర్చుకుంటారని.. కానీ మన దేశంలో పరిస్థితి దానికి విరుద్ధంగా ఉందని సిద్ధరామయ్య అసహనం వ్యక్తం చేశారు. ఇంగ్లీష్, హిందీ మన పిల్లల ప్రతిభను బలహీనపరుస్తున్నాయన్నారు. ఈ సమస్యను నివారించాలంటే మాతృభాషను బోధనా మాధ్యమంగా ప్రవేశపెడుతూ.. చట్టాలను తీసుకురావాలన్నారు. కన్నడ భాష దాని సంస్కృతిని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని సిద్ధరామయ్య నొక్కి చెప్పారు. విద్య విషయంలో కన్నడ భాషపై జరుగుతున్న నిర్లక్ష్యం రాష్ట్రంలో అనేక సమస్యలకు కారణమయ్యిందన్నారు. 

హిందీ, సంస్కృత భాషాభివృద్ధికి నిధులు కేటాయిస్తున్న కేంద్రం.. దేశంలోని ఇతర భాషల అభివృద్ధికి మాత్రం ఎటువంటి గ్రాంట్లు మంజూరుచేయకుండా అన్యాయం చేస్తోందన్నారు. కన్నడను వ్యతిరేకించే వారిని రాష్ట్ర ప్రజలు కూడా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం కేంద్రానికి రూ.4.5 లక్షల కోట్ల ఆదాయాన్ని అందిస్తున్నప్పటికీ.. భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మాత్రం కర్ణాటక అభివృద్ధికి నిధులివ్వడానికి నిరాకరిస్తోందని ఆరోపించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు