Indian Railways: వృద్ధులకు రాయితీ పునరుద్ధరిస్తారా?.. రైల్వే మంత్రి ఏమన్నారు?

Ashwini Vaishnaw on Ticket concession: ప్రతి ప్రయాణికుడికీ రైల్వే శాఖ 55 శాతం రాయితీ ఇస్తోందని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ అన్నారు.

Updated : 12 Jan 2024 18:14 IST

Indian Railways | అహ్మదాబాద్‌: ప్రతి ప్రయాణికుడికీ 55 శాతం రాయితీని రైల్వే శాఖ (Indian Railways) అందిస్తోందని ఆ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ (Ashwini Vaishnaw) అన్నారు. వృద్ధులకు, జర్నలిస్టులకు గతంలో ఇచ్చిన రాయితీ పునరుద్ధరణ గురించి మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు ఆయన పైవిధంగా స్పందించారు. ప్రతి ప్రయాణికుడూ ఇది వరకే రాయితీని అనుభవిస్తుండగా.. ప్రత్యేకంగా రాయితీ అవసరం లేదన్నట్లు పరోక్షంగా ఆయన బదులిచ్చారు.

బుల్లెట్‌ రైలు ప్రాజెక్ట్‌ సహా వివిధ అంశాలపై అహ్మదాబాద్‌లో అశ్వినీ వైష్ణవ్‌ సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రతి ప్రయాణికుడికి రైల్వే శాఖ 55 శాతం రాయితీ అందిస్తోంది. ప్రయాణానికి రూ.100 ఖర్చవుతుంటే రూ.45 మాత్రమే ఛార్జి రూపంలో వసూలు చేస్తోంది. అంటే ప్రతి ప్రయాణికుడికి ఇది వరకే 55 శాతం రాయితీ ఇచ్చినట్లే కదా’’ అని సమాధానం ఇచ్చారు.

‘11 రోజుల ప్రత్యేక అనుష్ఠానం’ పాటించనున్న మోదీ

కొవిడ్‌కు ముందు వృద్ధులకు, ప్రభుత్వ గుర్తింపు పొందిన జర్నలిస్టులకు రైలు టికెట్‌ ధరలో 50 శాతం రాయితీ వర్తించేది. 2020 మార్చిలో లాక్‌డౌన్‌ సమయంలో రైళ్లను నిలిపివేయడంతో పాటు రాయితీలనూ రైల్వే శాఖ రద్దు చేసింది. 2022లో రైళ్లను పునురుద్ధరించినప్పటికీ.. రాయితీల జోలికెళ్లలేదు. వీటిని పునరుద్ధరించాలన్న డిమాండ్లు వస్తున్నా ఆ దిశగా అడుగులు పడలేదు. ఈ అంశంపై లోక్‌సభ, రాజ్యసభల్లో పలువురు ఎంపీలు ప్రశ్నలు అడిగినప్పుడూ రైల్వే మంత్రి ఇదే తరహాలో సమాధానం ఇచ్చారు. మరోవైపు వృద్ధులకు రాయితీని రద్దు చేయడం ద్వారా 2022-23లో రైల్వే రూ.2,242 కోట్లు ఆర్జించినట్లు ఆర్‌టీఐ దరఖాస్తులో వెల్లడైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని