Mahadev app: మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కుంభకోణంలో నిందితుడి తండ్రి అనుమానాస్పద మృతి

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల వేళ సంచలనం సృష్టించిన మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కుంభకోణంలో కీలక నిందితుడి తండ్రి అనుమానాస్పద స్థితిలో మరణించాడు.

Updated : 06 Dec 2023 10:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఛత్తీస్‌గఢ్‌లో రాజకీయంగా పెను సంచలనం సృష్టించిన మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ (Mahadev app) కుంభకోణంలో కీలక నిందితుడి తండ్రి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. రాష్ట్రంలోని దుర్గ్‌ జిల్లాలోని అచ్చోటి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకొంది. మహదేవ్‌ యాప్‌ కుంభకోణంలో అసిమ్‌ దాస్‌ కీలక నిందితుడు. అతడి త్రండి సుశీల్‌దాస్‌ (62) ఆచూకీ గత రెండు రోజులుగా తెలియడం లేదు. అతడి మృతదేహాన్ని మంగళవారం స్వగ్రామంలోని ఓ బావిలో గుర్తించారు.

కొన్ని విషయాలపై మౌనమే ఉత్తమం

జిల్లా సీనియర్‌ ఎస్పీ రామ్‌గోపాల్‌ గర్గ్‌ ఈ ఘటనపై మాట్లాడుతూ.. సుశీల్‌ దాస్‌ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నామని పేర్కొన్నారు. మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. మృతుడు ఓ ప్రైవేటు కంపెనీలో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు.

మృతుడు సుశీల్‌దాస్‌ కుమారుడు అసిమ్‌ దాస్‌(కొరియర్‌), కానిస్టేబుల్‌ భీమ్‌ సింగ్‌ను మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కుంభకోణంలో నవంబర్‌ 3వ తేదీన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అరెస్టు చేసింది. ఈ బెట్టింగ్‌ యాప్‌ ప్రమోటర్లు ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌కు రూ.508 కోట్ల మేర ఇచ్చినట్లు ఈడీ ఆరోపించింది. ఈ కేసులో అరెస్టయిన కొరియర్‌ తొలుత తన వాంగ్మూలంలో ఈ విషయాన్ని చెప్పినట్లు దర్యాప్తు సంస్థ పేర్కొంది. అయితే, తర్వాత కొరియర్‌ మాట మార్చాడు. ఎన్నికలకు ముందు ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం లేపింది.

ఈ యాప్‌ ప్రమోటర్లలో ఒకరైన సౌరభ్‌ చంద్రకర్‌ వివాహం ఈ ఏడాది ఫిబ్రవరిలో యూఏఈలో జరిగింది. ఇందుకోసం రూ.200 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది. బాలీవుడ్‌ సెలబ్రిటీలను దీనికి ఆహ్వానించినట్లు ఈడీ గుర్తించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని