Uttarakhand Rains: గంగమ్మ ఉగ్రరూపం.. హరిద్వార్‌కు అలర్ట్‌

Rains in Uttarakhand: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలకు గంగా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. అటు కొండచరియలు విరిగిపడి పలు చోట్ల రహదారులు మూతబడ్డాయి.

Published : 17 Jul 2023 11:45 IST

దేహ్రాదూన్‌: భారీ వర్షాల (Heavy Rains)తో ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. నదులు ఉప్పొంగడంతో వరదలు సంభవించి జనజీవనం అస్తవ్యస్తమైంది. అటు దిల్లీలో యమునా నది ఇంకా ప్రమాదకర స్థాయి పైనే ప్రవహిస్తుండగా.. ఇప్పుడు ఉత్తరాఖండ్‌ (Uttarakhand)లో గంగా నది (Ganga Rover) ఉగ్రరూపం దాల్చింది.

భారీ వర్షాలతో అలకనంద నదిపై ఉన్న జీవీకే హైడ్రోఎలక్ట్రిక్‌ ప్రాజెక్ట్‌ డ్యామ్‌ నిండటంతో దిగువకు నీటిని విడుదల చేశారు. దీంతో దేవప్రయాగ వద్ద గంగా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోందని అధికారులు తెలిపారు. హరిద్వార్‌ (Haridwar)లో గంగానది వార్నింగ్‌ స్థాయి అయిన 293 మీటర్లను దాటి ప్రమాదకరంగా మారింది. దీంతో నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాల ప్రజలకు అధికారులు అలర్ట్‌ జారీ చేశారు. వరద (Floods) ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ప్రజలను ఇప్పటికే శిబిరాలకు తరలించారు. హరిద్వార్‌, రూర్కీ, ఖాన్‌పుర్‌, భగవాన్‌పుర్‌, లస్కర్‌ పరిధిలోని అనేక గ్రామాల్లో వరద నీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు.

సొరంగం నుంచి 13 మృతదేహాలు వెలికితీత

భారీ వర్షాలకు ఉత్తరాఖండ్‌ (Uttarakhand) వ్యాప్తంగా కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అనేక చోట్ల రహదారులపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాల కారణంగా 17 రోడ్లు, తొమ్మిది వంతెనలు దెబ్బతిన్నాయి. అటు సోమవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో ఉత్తరాఖండ్‌లోని 13 జిల్లాలకు నేడు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు.

మళ్లీ ఉప్పొంగుతున్న యమునా నది..

అటు దేశ రాజధాని దిల్లీలో యమునా నది మళ్లీ ఉప్పొంగుతోంది. నీటిమట్టం ఇంకా ప్రమాదకర స్థాయి పైనే ఉంది. సోమవారం ఉదయం 8 గంటలకు నది నీటిమట్టం 205.50 మీటర్లుగా ఉండగా.. 9 గంటల సమయానికి 205.58 మీటర్లకు పెరిగింది. ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహంతో పాటు భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉండటంతో నీటిమట్టం మరింత పెరగొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో పాత దిల్లీ యమునా వంతెనకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. మరోవైపు, దిల్లీలో వరద ప్రభావం కొనసాగుతూనే ఉంది. ఎర్రకోట, రాజ్‌ఘాట్‌ తదితర ప్రాంతాల్లో ఇంకా నీరు నిలిచే ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని