అంతరిక్ష వ్యాపారంలో భారత్‌ ఆశ్చర్యపరిచే పోటీదారు!.. ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ అసాధారణ ప్రశంసలు

భారతదేశ ప్రతిష్ఠాత్మక అంతరిక్ష కార్యక్రమంపై అమెరికాకు చెందిన ‘ది న్యూయార్క్‌ టైమ్స్‌’(ఎన్‌వైటీ) ప్రశంసల వర్షం కురిపించింది. అంతరిక్ష రంగంలో సాంకేతికతల అభివృద్ధికి ఏర్పాటైన అంకుర సంస్థల(స్టార్టప్స్‌) కృషిని ప్రత్యేకంగా ప్రస్తావించింది.

Updated : 06 Jul 2023 05:11 IST

హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్‌, ధ్రువ స్పేస్‌ల ప్రస్తావన

న్యూయార్క్‌: భారతదేశ ప్రతిష్ఠాత్మక అంతరిక్ష కార్యక్రమంపై అమెరికాకు చెందిన ‘ది న్యూయార్క్‌ టైమ్స్‌’(ఎన్‌వైటీ) ప్రశంసల వర్షం కురిపించింది. అంతరిక్ష రంగంలో సాంకేతికతల అభివృద్ధికి ఏర్పాటైన అంకుర సంస్థల(స్టార్టప్స్‌) కృషిని ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఓ విస్పోటం మాదిరిగా సాంకేతికాభివృద్ధి, నవోన్వేషణలు జరుగుతున్నాయని, త్వరలోనే చైనాకు ప్రధాన పోటీదారుగా మారగలదని పేర్కొంది. ‘ప్రపంచ అంతరిక్ష వ్యాపారంలో ఆశ్చర్యపరిచే పోటీదారు’ అనే శీర్షికన ప్రత్యేక వ్యాసాన్ని ఎన్‌వైటీ ప్రచురించింది. ‘‘1963లో తొలి రాకెట్‌ ప్రయోగం నాటి దశ నుంచి ఈ రంగంలో బుడిబుడి అడుగులు వేసుకుంటూ నేడు ప్రపంచంలోనే అత్యాధునిక సాంకేతికతలు గల దేశంగా భారత్‌ ఆవిర్భవించింది. కరోనా ప్రారంభ సమయానికి దేశంలో అంతరిక్ష సాంకేతికతలపై పనిచేసే అంకుర సంస్థలు 5 మాత్రమే. నేడు ఈ రంగంలో కనీసం 140 స్టార్టప్‌లు నమోదై ఉన్నాయ’’ని పేర్కొంది. అంతరిక్ష రంగంలోని వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవడానికి జరుగుతున్న భారీ ప్రయత్నంగా ఎన్‌వైటీ అభివర్ణించింది.

ఒక సాంకేతిక శక్తిగా ప్రముఖ స్థానానికి భారత్‌ ఎలా చేరుకుంటుందో వివరిస్తూ...గత నెలలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన, ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్‌తో కలిసి అగ్రనేతలిద్దరూ ఆ సందర్భంగా వెలువరించిన సంయుక్త ప్రకటనను ఉటంకించింది. ఉమ్మడి శత్రువైన చైనాను అత్యంత సమర్థంగా ఎదుర్కోవడానికి భారత్‌, అమెరికా దేశాలకు అంతరిక్ష రంగం సరైన వేదిక కాబోతోందని తెలిపింది. హైదరాబాద్‌ కేంద్రంగా అంతరిక్ష రంగంలో కృషి చేస్తున్న స్కైరూట్‌ ఏరోస్పేస్‌, ధ్రువ స్పేస్‌లను ఎన్‌వైటీ ప్రత్యేకంగా ప్రస్తావించింది. చౌకగా ఉపగ్రహ వాహకనౌకల సేవలు అందించేందుకు ఆ సంస్థలు చేస్తున్న ప్రయోగాలు, నూతన సాంకేతికతల అభివృద్ధి, యువ ఇంజినీర్లు, సాంకేతిక నిపుణుల లభ్యత తదితరాలను వివరించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)కు అవసరమైన పరికరాలు, ఉపకరణాల తయారీ కోసం బెంగళూరు, హైదరాబాద్‌, పుణే తదితర నగరాల్లో 400కు పైగా ప్రైవేటు కంపెనీలు ఆవిర్భవించాయని తెలిపింది. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న మరికొన్ని అంకుర సంస్థల కొత్త ఆవిష్కరణలనూ న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని