స్థానిక భాషల్లో చట్టాలు.. ఐపీసీనీ మారుస్తున్నాం

అందరికీ అర్థమయ్యేలా సులభతరం చేయడంతోపాటు స్థానిక భాషల్లోకి చట్టాలను మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. చట్టాలు, న్యాయ ప్రక్రియలో వాడే భాష న్యాయం అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.

Updated : 24 Sep 2023 05:58 IST

అంతర్జాతీయ న్యాయవాదుల సదస్సులో ప్రధాని మోదీ
న్యాయ పరిష్కారంలో సంస్థాగత భాగస్వామ్యానిదే ముఖ్య పాత్ర
సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ స్పష్టీకరణ

దిల్లీ: అందరికీ అర్థమయ్యేలా సులభతరం చేయడంతోపాటు స్థానిక భాషల్లోకి చట్టాలను మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. చట్టాలు, న్యాయ ప్రక్రియలో వాడే భాష న్యాయం అందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో దిల్లీలో  రెండు రోజులపాటు జరగనున్న అంతర్జాతీయ న్యాయవాదుల సదస్సును శనివారం ప్రధాని ప్రారంభించారు.

ఈ సదస్సులో ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ పాల్గొన్నారు. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌, లార్డ్‌ ఛాన్సలర్‌, బ్రిటన్‌ న్యాయశాఖ మంత్రి అలెక్స్‌ చాక్‌ కేసీ, భారత్‌ అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి, సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఛైర్మన్‌ మనన్‌ కుమార్‌ మిశ్ర తదితరులు హాజరయ్యారు. ప్రధాని మాట్లాడుతూ.. కృత్రిమ మేధను ఉపయోగించుకుని సైబర్‌ తీవ్రవాదం, మనీ లాండరింగ్‌ ద్వారా విధ్వంసకర కార్యకలాపాలకు పాల్పడటంపట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి ప్రమాదాలకు సరిహద్దులు లేవని, పరిధి ఉండదని, దేశాలన్నీ కలిసి న్యాయ నిబంధనలను రూపొందించుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ప్రమాదం అంతర్జాతీయంగా ఉన్నప్పుడు అదే స్థాయిలో దానిని డీల్‌ చేయాలని సూచించారు. ‘అన్ని దేశాల మధ్య విమాన రవాణా నియంత్రణ వ్యవస్థల్లో సహకారం ఉండాలి. ఇది ఒక ప్రభుత్వానికి సంబంధించినది కాదు. ప్రమాదాల నుంచి రక్షణకు అంతర్జాతీయ నిబంధనలను రూపొందించుకోవడం అవసరం’ అని పేర్కొన్నారు.

ఇద్దరికీ అర్థమయ్యేలా..

‘ప్రభుత్వపరంగా మేం చట్టాలు రెండు మార్గాల్లో అందుబాటులో ఉండాలని ఆలోచిస్తున్నాం. ఒకటి న్యాయ వ్యవస్థలోని వారు సులభంగా ఉపయోగించుకునేలా ఉండాలి, మరొకటి దేశంలోని సామాన్యుడు అర్థం చేసుకునేలా ఉండాలని భావిస్తున్నాం. చట్టాన్ని సామాన్యుడు తనదిగా భావించాలనేది మా అభిలాష’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ‘చట్టాలను సరళంగా, అందరికీ అర్థమయ్యేలా మార్చాలని అనుకుంటున్నాం. వ్యవస్థ పుట్టుక, చట్టాల రూపకల్పన సంక్లిష్టత నుంచి బయటకు రావాలని ప్రయత్నిస్తున్నాం. దీనికి ఎంతో చేయాల్సి ఉంది. ఎంతో సమయం తీసుకుంటుంది. అయినా ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉంటాం. డేటా రక్షణ చట్టంతో ఈ ప్రక్రియను ప్రారంభించాం’ అని ప్రధాని చెప్పారు. వలస కాలంనాటి భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ), సాక్ష్యాధారాల చట్టాలను మారుస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఇటీవలే వాటి స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య బిల్లులను ప్రవేశపెట్టామని చెప్పారు. జ్యుడీషియరీ, బార్‌ అసోసియేషన్లు సుదీర్ఘకాలంగా భారతీయ న్యాయ వ్యవస్థకు రక్షణగా నిలుస్తున్నాయని, భారత స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించాయని ప్రధాని వెల్లడించారు.

మధ్యవర్తిత్వ పరిష్కార వేదిక భేష్‌

వాణిజ్య లావాదేవీల్లో పెరుగుతున్న సంక్లిష్ట ప్రత్యామ్నాయ పరిష్కార తీర్మానం అనేది ఎంతో ముఖ్యమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటోందని తెలిపారు. ఇప్పటిదాకా ఉన్న సంప్రదాయ వివాద పరిష్కారానికి ప్రత్యామ్నాయంగా మధ్యవర్తిత్వ పరిష్కార వ్యవస్థను భారత్‌ తీసుకొచ్చిందని తెలిపారు. గత ఆరేళ్లుగా లోక్‌ అదాలత్‌లు వివాదాల పరిష్కారంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, దాదాపు 7 లక్షల వివాదాలను పరిష్కరించాయని వెల్లడించారు.

సంస్థాగత భాగస్వామ్యమే ముఖ్యం

న్యాయపరమైన సందేహాలకు పరిష్కారం చూపడంలో సంస్థాగత భాగస్వామ్యానిదే ముఖ్య పాత్రని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ అభిప్రాయపడ్డారు. ఇది న్యాయాన్ని అందించడంలోనూ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అంతర్జాతీయ న్యాయవాదుల సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ‘న్యాయం అందించడంలో ఒక్కో సవాలుకు ఒక్కో పరిష్కారంగా కాకుండా సవాళ్లన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చి నిబంధనావళి రూపొందించాలి. వాటికి వినూత్న పరిష్కారాలను కనుగొనాలి. విజ్ఞాన మార్పిడి అనేది పరస్పర ఆధారితం. సుప్రీంకోర్టు ఈ విషయంలో విదేశీ కోర్టులతో సంబంధాలు నెరపుతూనే ఉంది’ అని సీజేఐ పేర్కొన్నారు.

విభేదాల మాటున మరిచిపోతున్నాం

‘విభేదాలపై గట్టిగా పట్టుబడుతూ మనం సంస్థల మధ్య భాగస్వామ్య అవసరాన్ని మరిచిపోతున్నాం. ఇది న్యాయం చేయడంలో అడ్డంకిగా ఉందనేది నిజం. కీలకమైన రాజ్యాంగ అంశాల్లోనే కాకుండా కోర్టులు, ప్రభుత్వం మధ్య దైనందిన వ్యవహారాల్లోనూ ఇది కనిపిస్తోంది. మేం మోటారు వాహనాల చట్టం ప్రకారం.. చిన్న వాహనాలను నడిపే డ్రైవరు వాణిజ్య వాహనాలను నడపొచ్చా అనే కేసును విచారిస్తున్నాం. దీనిని ప్రతికూల సవాలుగా చూడటానికి బదులుగా కోర్టు, ప్రభుత్వం.. దేశంలోని లక్షల మంది డ్రైవర్ల జీవనోపాధికి సంబంధించిన సమస్యగా చూసేందుకు భాగస్వామ్యమయ్యాం. వివిధ వ్యవస్థల అంతిమ లక్ష్యం దేశాభివృద్ధి, సమగ్రతే’ అని జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు