పెండింగ్‌లో 70 కొలీజియం సిఫార్సులు

న్యాయమూర్తుల నియామకాలు, బదిలీలకు సంబంధించి కొలీజియం చేసిన 70 సిఫార్సులు కేంద్ర ప్రభుత్వం వద్ద చాలా కాలంగా పెండింగ్‌లో ఉండడంపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది.

Updated : 27 Sep 2023 06:06 IST

కేంద్రం జాప్యంపై సుప్రీంకోర్టు విస్మయం

దిల్లీ: న్యాయమూర్తుల నియామకాలు, బదిలీలకు సంబంధించి కొలీజియం చేసిన 70 సిఫార్సులు కేంద్ర ప్రభుత్వం వద్ద చాలా కాలంగా పెండింగ్‌లో ఉండడంపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. వీటిని పరిష్కరించటానికి ప్రయత్నించాలని అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణికి సూచించింది. జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ సుధాంశు ధూలియాలతో కూడిన ధర్మాసనం ఈ విషయాన్ని మంగళవారం ప్రస్తావించగా... తనకు వారం రోజుల వ్యవధి ఇవ్వాలని, ప్రభుత్వాన్ని సంప్రదించి చెబుతానంటూ అటార్నీ జనరల్‌ పేర్కొన్నారు. స్వల్ప సమయాన్ని కోరినందున తాము సంయమనం వహిస్తున్నామని, ఈసారి అలా ఉండబోమని జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ స్పష్టం చేశారు. ‘‘గత వారం వరకూ కొలీజియం చేసిన 80 సిఫార్సులు పెండింగ్‌లో ఉన్నాయి. పది సిఫార్సులకు క్లియరెన్స్‌ ఇవ్వడంతో ఇంకా 70 మిగిలే ఉన్నాయి. వీటిలో 26 సిఫార్సులు జడ్జీల బదిలీలకు చెందినవి. ఏడు ప్రభుత్వానికి మళ్లీ పంపిన సిఫార్సులు. తొమ్మిదింటిని అసలు కొలీజియానికే తిప్పిపంపకుండా అలాగే ఉంచేశారు. మరో కేసు సున్నితమైన హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిని నియమించడానికి సంబంధించినది. ఈ సిఫార్సులన్నీ గత ఏడాది నవంబరు నుంచి పెండింగ్‌లోనే ఉన్నాయ’’ని జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ అసహనం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు కొలీజియం సభ్యుల్లో ఒకరైన జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌...సర్వోన్నత న్యాయస్థానం, హైకోర్టులలో జడ్జీల నియామక వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. కొలీజియం సిఫార్సులు సత్వరమే అమలులోకి వచ్చేలా తీవ్రంగా కృషి చేస్తున్నప్పటికీ ఇంకా పెండింగ్‌లోనే ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి 10-12 రోజులకు ఈ విషయమై అటార్నీ జనరల్‌కు గుర్తు చేస్తూనే ఉన్నామని తెలిపారు. కొలీజియం సిఫార్సులపై నిర్ణీత కాలవ్యవధిలోగా నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు 2021లో తీర్పు వెలువరించింది. దీనిని  కేంద్ర న్యాయశాఖ ఉల్లంఘిస్తున్నందున ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ విషయాలు తెలిపింది. తదుపరి విచారణను అక్టోబరు 9వ తేదీకి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని