లౌకికవాదానికి ఇదే అసలైన నిర్వచనం

రామమందిర నిర్మాణం కోసం ప్రారంభించిన రామజన్మభూమి ఉద్యమం కుహనా లౌకికవాదుల దాడి నడుమ లౌకికవాదానికి అసలైన నిర్వచనం తిరిగి పొందేందుకు ఓ చిహ్నంగా నిలించిందని భాజపా దిగ్గజ నేత ఎల్‌కే ఆడ్వాణీ (96) అభిప్రాయపడ్డారు.

Published : 14 Jan 2024 04:13 IST

‘అయోధ్య’ రథసారథి ఎల్‌కే ఆడ్వాణీ

దిల్లీ, అయోధ్య: రామమందిర నిర్మాణం కోసం ప్రారంభించిన రామజన్మభూమి ఉద్యమం కుహనా లౌకికవాదుల దాడి నడుమ లౌకికవాదానికి అసలైన నిర్వచనం తిరిగి పొందేందుకు ఓ చిహ్నంగా నిలించిందని భాజపా దిగ్గజ నేత ఎల్‌కే ఆడ్వాణీ (96) అభిప్రాయపడ్డారు. ‘శ్రీరామ మందిరం : నెరవేరిన దివ్య కల’ పేరుతో ఆయన రాసిన వ్యాసంలోని మరికొంత సమాచారాన్ని ఆడ్వాణీ కార్యాలయం శనివారం విడుదల చేసింది. ఈ ఉద్యమం సందర్భంగానే నికార్సైన లౌకికవాదం, కుహనా లౌకికవాదాల నడుమ తేడాలపై దేశమంతా ఓ ప్రత్యేకమైన చర్చ ప్రారంభమైందని ఆయన తెలిపారు. ‘‘1990లో రామమందిర నిర్మాణం కోసం మేం రథయాత్ర ప్రారంభించినపుడు ప్రజల మద్దతు పుష్కలంగా లభించగా, చాలా రాజకీయ పార్టీలు మా వెంట నడిచేందుకు జంకాయి. ముస్లిం ఓట్లు పోతాయని వారి భయం. ఓటుబ్యాంకు రాజకీయాలకు లొంగిపోయి సెక్యులరిజం పేరుతో వారు తమ వైఖరిని సమర్థించుకున్నారు’’ అన్నారు. ఈ చారిత్రక సందర్భాన్ని కళ్లారా చూడటంతో తన జన్మ ధన్యమైందని.. భారత పౌరుడిగా గర్వపడుతున్నానని చెప్పారు. ‘‘అయోధ్య భూవివాదంపై కోర్టులో సుదీర్ఘ న్యాయపోరాటం జరుగుతున్నపుడు నాతోపాటు భాజపా, సంఘ్‌ పరివార్‌లోని ప్రతి సభ్యుడు రామ్‌లల్లాను న్యాయమైన స్థానంలో ప్రతిష్ఠించాలనే కల సాకారమయ్యే దిశగా భారతీయుల ఆత్మను మేల్కొలిపేందుకు కృషి చేస్తూ వచ్చాం. 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయాత్మక తీర్పుతో ప్రశాంత వాతావరణంలో రామమందిర పునర్నిర్మాణం జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అన్నారు.

ఆ ఇద్దరినీ మిస్సవుతున్నా..

ఈ శుభ తరుణంలో ఇద్దరు వ్యక్తుల లోటు తనకు బాగా కనిపిస్తోందని ఆడ్వాణీ చెప్పారు. ఒకరు తన భార్య కమల కాగా, మరొకరు మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయిగా పేర్కొన్నారు. ‘‘వాజ్‌పేయీ నా రాజకీయ, వ్యక్తిగత జీవితంలో అంతర్భాగం. ఇక రెండో వ్యక్తి నా భార్య దివంగత కమల. ప్రజాజీవితంలో సుదీర్ఘమైన నా ప్రస్థానానికి ఆమె స్థిరత్వం, అసమాన బలాన్ని చేకూర్చింది’’ అని ఆడ్వాణీ గుర్తుచేసుకున్నారు.

మారిషస్‌ ఉద్యోగులకు ‘అయోధ్య’ సెలవు

పోర్ట్‌ లూయిస్‌: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ సందర్భంగా మారిషస్‌ ప్రభుత్వం తమ ఉద్యోగులకు ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకొంది. ఉద్యోగుల్లో హిందూమత విశ్వాసం ఉన్నవారు  జనవరి 22న ప్రార్థనలకు హాజరయ్యేందుకుగాను రెండు గంటలపాటు ప్రత్యేక సెలవు మంజూరు చేసింది.


10.2 కి.మీ. సౌరదీపాలతో గిన్నిస్‌ రికార్డ్‌

అయోధ్యలో ఏర్పాటుచేసిన ‘సౌర వీధి’ గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్సులో చోటు సాధించింది. స్థానిక గుప్తార్‌ ఘాట్‌ నుంచి నిర్మల్‌కుండ్‌ మధ్య ఉన్న 10.2 కిలోమీటర్ల దూరానికి 470 సౌరదీపాలను అమర్చారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సౌరశక్తి వీధిదీపాల లైనుగా ‘గిన్నిస్‌’ గుర్తించింది. సంప్రదాయ విద్యుత్తు సరఫరాపై ఆధారపడకుండా వీధులతోపాటు పలు కీలక మార్గాలు, పార్కులు, ఘాట్లలోనూ సోలార్‌ ట్రీల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని