చర్చలు విఫలం

పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, పత్తిని ప్రభుత్వ సంస్థలు కనీస మద్దతు ధరకు కొంటాయని, ఇందుకోసం ఐదేళ్ల ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధమని రైతు సంఘాల నేతలకు కేంద్రం ప్రతిపాదించింది.

Updated : 20 Feb 2024 06:55 IST

ఆందోళన కొనసాగింపునకు రైతు నేతల నిర్ణయం

చండీగఢ్‌: పప్పు ధాన్యాలు, మొక్కజొన్న, పత్తిని ప్రభుత్వ సంస్థలు కనీస మద్దతు ధరకు కొంటాయని, ఇందుకోసం ఐదేళ్ల ఒప్పందం కుదుర్చుకునేందుకు సిద్ధమని రైతు సంఘాల నేతలకు కేంద్రం ప్రతిపాదించింది. అయితే అది తమకు సమ్మతం కాదని నేతలు తిరస్కరించారు. ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట వరకూ జరిగిన చర్చల సందర్భంగా కేంద్ర మంత్రులు అర్జున్‌ ముండా, పీయూష్‌ గోయల్‌, నిత్యానంద్‌ రాయ్‌ ఐదేళ్ల ప్రతిపాదనను రైతు సంఘాల నేతల ముందుంచగా చర్చించి నిర్ణయాన్ని వెల్లడిస్తామని తొలుత రైతు నేతలు తెలిపారు. ఆ తర్వాత రైతులతో చర్చించిన అనంతరం కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు సోమవారం సాయంత్రం ప్రకటించారు. అది రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా లేదని తెలిపారు. ‘రైతులతోపాటు మా రెండు వేదికల్లో చర్చించాం. అందులో కేంద్రం ప్రతిపాదన రైతులకు ప్రయోజనకరంగా లేదని అభిప్రాయం వ్యక్తమైంది. అందుకే ఆ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నాం’ అని జగ్జీత్‌ సింగ్‌ దల్లేవాల్‌ వెల్లడించారు.  

4 గంటలపాటు చర్చలు

రైతు సంఘాల నాయకులతో కేంద్ర మంత్రుల బృందం చర్చలు 4 గంటలకుపైగా సాగాయి. ఈ సుదీర్ఘ సమావేశంలో చట్టబద్ధమైన కనీస మద్దతు ధర హామీతోపాటు రైతుల ఇతర డిమాండ్లపై చర్చలు జరిపారు. నాలుగో విడత జరిగిన ఈ సమావేశంలో పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ పాల్గొన్నారు. రైతు నేతలతో సమావేశానంతరం కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ మీడియాతో మాట్లాడారు. ‘ఎన్‌సీసీఎఫ్‌, నాఫెడ్‌లాంటి ప్రభుత్వ సహకార సంస్థలు వివిధ పంటలు పండించే రైతులతో ఒప్పందం కుదుర్చుకుంటాయి. వచ్చే ఐదేళ్లపాటు వారి పంటను కనీస మద్దతు ధరతో కొనుగోలు చేస్తాయి’ అని చెప్పారు. రైతులు ఉత్పత్తి చేసిన పంటల మొత్తాన్ని కొనుగోలు చేస్తామని, దీనికి ఎలాంటి పరిమితులు ఉండబోవని రైతులకు వివరించినట్లు పేర్కొన్నారు. కొనుగోళ్ల కోసం ప్రత్యేక పోర్టల్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ నిర్ణయం పంజాబ్‌ వ్యవసాయాన్ని కాపాడుతుందని, భూగర్భ జలాలను మెరుగుపరుస్తుందని వివరించారు. రైతులతో మరోసారి సమావేశమయ్యే అవకాశముందని చెప్పారు. రైతులు చేస్తున్న కొన్ని డిమాండ్లపై సమగ్ర చర్చ లేకుండా నిర్ణయం తీసుకోలేమని తెలిపారు. 2014-2024 మధ్య నరేంద్ర మోదీ ప్రభుత్వం రూ.18 లక్షల కోట్ల విలువైన పంటలను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేసిందని చెప్పారు. అదే 2004-2014 మధ్య కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.5.50 లక్షల విలువైన పంటలనే కొనుగోలు చేసిందని తెలిపారు.

6 రోజులుగా సరిహద్దుల్లోనే..

పంటలకు కనీస మద్దతు ధర, స్వామినాథన్‌ కమిటీ సిఫార్సుల అమలు, గతంలో రైతులు చేపట్టిన ఆందోళనల్లో మృతి చెందిన కర్షకుల కుటుంబాలకు సాయం అందించడం సహా పలు డిమాండ్లను ఆమోదించాలని కోరుతూ గత వారం రైతు సంఘాలు దిల్లీ చలోకు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో ట్రాక్టర్లు, ట్రాలీలతో ర్యాలీగా బయలుదేరిన రైతులను శంభు సరిహద్దుల్లో పోలీసులు అడ్డుకున్నారు. దిల్లీవైపు వెళ్లకుండా బారికేడ్లు, ఇనుప కంచెలు, కాంక్రీట్‌ దిమ్మెలను ఏర్పాటు చేశారు. దీంతో కేంద్రం తమ డిమాండ్లను అంగీకరించాలని, లేదంటే శాంతియుతంగా దిల్లీ వరకూ ర్యాలీ చేపట్టేందుకు అనుమతించాలని కోరుతూ రైతులు 6 రోజులుగా సరిహద్దుల్లోనే ఉండిపోయారు.


21న దిల్లీకి చేరుకుంటాం

కేంద్రంతో చర్చలు విఫలమైన నేపథ్యంలో ఈ నెల 21వ తేదీన ఉదయం 11 గంటలకు దిల్లీకి చేరుకుంటామని, శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తామని రైతు నేత శర్వాన్‌ సింగ్‌ పంథేర్‌ తెలిపారు. కేంద్ర ప్రతిపాదనను తిరస్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. తమ సమస్యలనైనా పరిష్కరించాలని, లేదంటే దిల్లీకి వెళ్లేందుకు వీలుగా బారికేడ్లను తొలగించాలని ఆయన డిమాండు చేశారు.

 మరోవైపు ఈ నెల 23వ తేదీన దిల్లీకి మార్చ్‌ నిర్వహిస్తామని నొయిడా, గ్రేటర్‌ నొయిడా రైతులు తెలిపారు. భూసేకరణకు అధిక పరిహారం, అభివృద్ధి చేసిన ప్లాట్ల అప్పగింతపై ఈ మార్చ్‌ నిర్వహించనున్నామని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు